Site icon NTV Telugu

మెగాస్టార్ ఔదార్యం.. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి ఆపన్న హస్తం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రైలు, బస్సు ద్వారా హైదరాబాద్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చిరంజీవి పెద్దమనసుతో వ్యవహరించారు. వెంకట్, అతడి భార్య సుజాత విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేయించారు.

Read Also: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న “ఎఫ్ 3”

ఈ నేపథ్యంలో శనివారం నాడు వెంకట్ తన భార్యతో కలిసి మెగాస్టార్‌ను కలిశాడు. తన ఇంటికి వచ్చిన అభిమాని కుటుంబాన్ని చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. వెంకట్ అనారోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అభిమాని కుటుంబాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. మెడికల్ రిపోర్టులపై అక్కడి వైద్యులతో చిరంజీవి స్వయంగా మాట్లాడారు. అనంతరం వెంకట్ విశాఖలోనే చికిత్స పొందవచ్చని.. వైద్యానికి అయ్యే ఆస్పత్రి ఖర్చులను తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. కావాలంటే మెరుగైన చికిత్స కోసం తానే చెన్నై పంపిస్తానని తెలిపారు. దీంతో అభిమాని పట్ల చిరంజీవి చూపించిన ఔదార్యానికి ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు.

Exit mobile version