మెగా హీరో రామ్ చరణ్ విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులన్నింటిని బుధవారం రాత్రి నుంచి నిలిపివేసింది. 2015లో ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌తో ఏవియేషన్ వ్యాపారంలో అడుగుపెట్టాడు రామ్ చరణ్. అయితే ఈ సంస్థకు చెందిన అన్ని విమాలను గత రాత్రి నుంచి గ్రౌండ్ డౌన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ గాను, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న నష్టాలే అని తేలింది. పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రూజెట్ 2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 143 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. 2020లో 10.1 కోట్లు, 2019లో 17.56 కోట్లు నష్టపోయినట్లు చెబుతోందీ సంస్థ.
ఇటీవల ట్రూజెట్ కొత్త సి.ఎఫ్.వోని నియమించింది. గత రెండు నెలలుగా సంస్థ ఉద్యోగులకు పూర్తి జీతాలు కూడా చెల్లించలేదట. ట్రూజెట్ ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా భారత విమానయాన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కామన్ పీపుల్ కూడా విమానయానం చేయటానికి అనువుగా భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు రాయితీలు కల్పించింది. అయినా విమానయాన సంస్థల మనుగడ కష్టంగా మారింది. ఇక కోవిడ్ మహమ్మారి పరిస్థితిని మరింత దిగజార్చింది. ట్రూజెట్ పతనం ఇతర విమానయాన సంస్థలకు ప్రయోజనంగా మారనుంది. పెట్టుబడిదారులతో ట్రూజెట్ చర్చలు విఫలమైతే, ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రూజెట్ స్లాట్‌లు, రూట్స్ తో పాటు విమానాలను కూడా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో!?
