(మార్చి 27న మాయాబజార్కు 65 ఏళ్ళు పూర్తి)
మహానటుడు యన్.టి.రామారావును అపర శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా దిగ్దర్శకులు కే.వి.రెడ్డికే దక్కుతుంది. అసలు యన్టీఆర్ లో శ్రీకృష్ణుడు దాగున్నాడన్న సత్యాన్ని గ్రహించిన తొలి వ్యక్తి దర్శక నిర్మాత ఎఫ్.నాగూర్ అన్న విషయం ఎంతమందికి తెలుసు? 1954లోనే నాగూర్ తెరకెక్కించిన ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో ఓ స్వప్నగీతంగా దర్శనమిచ్చే మదిలో హాయి... కలలే వేయి... విరిసేనీ రేయి గోపాలబాల... అంటూ సాగే పాటలో యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించారు. ఆ తరువాత సొంతవూరులో ఓ సన్నివేశంలో కాసేపు కృష్ణునిగా నటించారు. సొంతవూరు అంతగా విజయం సాదంచలేదు. దాంతో యన్టీఆర్ తాను శ్రీకృష్ణ పాత్రకు తగనేమో అన్న అనుమానం కలిగిందని, అందువల్ల తాను మాయాబజార్లో శ్రీకృష్ణుని పాత్ర చేయనని చెప్పారని కథలు వినిపిస్తూ ఉంటాయి. కేవీ రెడ్డి, యన్టీఆర్ లోని అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఆయనను పీతాంబరం, భక్తవత్సలం సహాయంతో శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దారని అందరికీ తెలుసు. మాయాబజార్ తరువాత ఇరవైకి పైగా చిత్రాలలో యన్టీఆర్ శ్రీకృష్ణునిగా తెరపై కనిపించడం విశేషం! ఓ నటుడు ఓ పౌరాణిక పాత్రను అన్నిసార్లు తెరపై ప్రదర్శించడం అన్నది ప్రపంచంలో మరెక్కడా కానరాదు. అందునా భారతీయులు అతిపవిత్రంగా భావించే శ్రీకృష్ణ పరమాత్మ పాత్రను అంతలా అభినయించి,అలరించిన నటరత్నం వేరొకరు లేరు. రామారావును అపర శ్రీకృష్ణునిగా నిలిపిన మాయాబజార్ చిత్రం 1957 మార్చి 27న విడుదలయింది.
తెలుగువారి అత్యంత అభిమానపాత్రమైన చిత్రంగా పలుమార్లు మాయాబజార్ ఎన్నికయింది. ఇక 2013 మేలో ఐబీయన్ సంస్థ నిర్వహించిన పోల్ లో కేవీ రెడ్డి రూపొందించిన మాయాబజార్ భారతదేశంలో అత్యద్భుత చిత్రంగా ఎన్నికయింది. వందలాది పరభాషా చిత్రాలను త్రోసి రాజని విజయావారి మాయాబజార్ ఆ ఘనతను సాధించుకోవడంలో తెలుగువారి సినిమా అభిమానం కూడా కనిపిస్తుంది. ఇక తెలుగునాట ఎంతోమందికి, చిత్ర ప్రముఖులకు సైతం అభిమాన చిత్రంగా మాయాబజార్ నిలచింది. అతిరథమహారథులు అనదగ్గ వారందరూ ఇందులో నటించడం విశేషం! ఆ కారణంగానూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొందీ చిత్రం. ఇక నిర్మాతలు బి.నాగిరెడ్డి, చక్రపాణి ఈ సినిమాను నిర్మించిన తీరు, వారి వ్యయానికి తగ్గట్టుగా కేవీ రెడ్డి చిత్రాన్ని తీర్చిదిద్దిన వైనం మరపురానివి. మరువలేనివి.
మాయాబజార్ అని సినిమా మకుటం ఉన్నా, ఎక్కడా ఈ మాట చిత్రం మొత్తంలో వినిపించదు. అంతకుముందు విశేషంగా ప్రాచుర్యంలో ఉన్న పౌరాణిక జానపద గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి మనకు శశిరేఖ పాత్ర మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ దర్శనమివ్వదు. శశిరేఖ పాత్రనే వత్సల అని కూడా పిలుస్తారు. అందువల్ల వత్సలా కళ్యాణం, శశిరేఖా పరిణయం అన్న టైటిల్స్ తోనూ కొన్ని చిత్రాలు రూపొందాయి. శాంతకుమారి శశిరేఖగా 1935లో మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం. ఆ చిత్రం విడుదలైన 22 సంవత్సరాలకు విజయా సంస్థ శశిరేఖా పరిణయం, వత్సలా కళ్యాణ పేర్లతో తెలుగు, తమిళ భాషల్లో మాయాబజార్ చిత్రాన్ని నిర్మించింది. రెండు భాషల్లోనూ మాయాబజార్ పేరుతోనే చిత్రాలను విడుదల చేయడం విశేషం!
సుప్రసిద్ధమైన కథ!మాయాబజార్ కథ విషయానికి వస్తే – శ్రీకృష్ణుని అన్న బలరామునికి ఒకే ఒక కూతురు శశిరేఖ. ఆమె పుట్టినరోజుకు వారి చెల్లెలు సుభద్ర, తన తనయుడు అభిమన్యునితో కలసి వస్తుంది. ఆ పసివయసులోనే శశిరేఖ, అభిమన్యుల నడుమ చనువు పెరుగుతుంది. బలరాముడు తన కూతురు శశిరేఖను అభిమన్యునికి ఇచ్చి వివాహం చేస్తానని చెల్లెలు సుభద్రకు మాట ఇస్తాడు. తరువాత సుభద్ర మెట్టినింటికి పోవడం, ఆ పై పాండవులు జూదంలో ఓడిపోవడం, తరువాత శశిరేఖ తనయుడు అభిమన్యునితో పుట్టింటికి రావడం జరుగుతాయి. విభవం వీడిన సుభద్ర రావడం బలరాముని భార్య రేవతికి అంతగా ఇష్టం ఉండదు. ఇక అభిమన్యునితో శశిరేఖ తిరగడం అసలు నచ్చదు. పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాన్ని సహించనని నాగలి వేసుకొని వెళ్లిన బలరాముడు వచ్చిన పని మరచిపోయి, తన ప్రియశిష్యుడైన దుర్యోధనుని తనయుడు లక్ష్మణకుమారునికి శశిరేఖను ఇచ్చి పెళ్ళి చేయడానికి మాట ఇస్తాడు. ఇది తెలిసిన సుభద్ర అన్నను నిలదీస్తుంది. దాంతో మాటామాటా పెరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉపాయం పన్ని, సుభద్ర, అభిమన్యులను దారుకుని రథంలో ఘటోత్కచ ఆశ్రమం పంపిస్తాడు. అక్కడ ఎవరెవరో తెలియక అభిమన్యుడు, ఘటోత్కచుడు ఆయుధాలు దూసుకుంటారు. చివరకు సుభద్ర కారణంగా ఆమె ఎవరో తెలుసుకున్న ఘటోత్కచుడు శరణు వేడి, తన పిన్నిని, తమ్ముని తోడ్కొని వెళతాడు. అసలు విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు ద్వారకను పెకిలించి శశిరేఖను తీసుకు రావాలని వెళతాడు. అక్కడ శ్రీకృష్ణుని ఉపాయంతో శశిరేఖను తీసుకు వెళ్ళి తన ఇంట పెడతాడు. తాను మాయాశశిరేఖగా వచ్చి, పెళ్ళికుమారుడు లక్ష్మణ కుమారుని ఆటపట్టించి, పెళ్ళి కాస్తా చెడగొడతాడు. అందరూ
ఘటోత్కచుని ఆశ్రమం చేరుకుంటాడు. అక్కడ పెళ్ళాడిన శశిరేఖ, అభిమన్యుల దీవిస్తారు. అదంతా తన కొడుకు ఘనకార్యమని హిడింబ అంటుంది. కాదు తల్లీ ఇదంతా శ్రీకృష్ణుల వారి లీల అంటూ ఘటోత్కచుడు కృష్ణస్తోత్రం పఠించడంతో విష్ణు రూపంలో దర్శనమిచ్చి కృష్ణుడు అందరినీ ఆశీర్వదిస్తూండగా కథ ముగుస్తుంది.
తెలుగునేలపైన సుప్రసిద్ధమైన ఈ కథను అప్పటికే ఏడుసార్లు ఉత్తర, దక్షిణ భేదం లేకుండా తెరకెక్కించారు. అందరికీ సుపరిచితమైన కథనే అయినా, దానిని జనరంజకంగా రూపొందించడంలో కేవీ రెడ్డి కృతకృత్యులయ్యారు. అందుకు మార్కస్ బార్ట్లే కెమెరా పనితనం కూడా తోడయిందని చెప్పక తప్పదు. ఈ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు పెద్ద ఎస్సెట్! ఇందులోని శ్రీకరులు దేవతలు..., అల్లి బిల్లి అమ్మాయికి..., నీవేనా నను పిలిచినది..., విన్నావ యశోదమ్మా..., హే కృష్ణా...ముకుందా...```(బిట్ సాంగ్),చూపులు కలసిన శుభవేళ…,లాహిరి లాహిరి లాహిరిలో…,భళి భళి భళి దేవా…,నీ కోసమె నే జీవించునది…,అటు ఉన్నది ఇటు లేదు…(బిట్ సాంగ్),దయ చేయండి…దయ చేయండి…,అహ నా పెళ్ళంట…,సుందరి నీ వంటి దివ్యస్వరూపము…,వివాహ భోజనంబు…,జై సత్యసంకల్ప జై శేష తల్పా…“ అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ సినిమాకు తొలుత సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తానే స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు రాజేశ్వరరావు. తరువాత ఘంటసాల సంగీత సారథ్యంలో పాటలు రూపొందాయి.
యన్.టి.రామారావు శ్రీకృష్ణునిగా నటించిన ఈచిత్రంలో అభిమన్యునిగా ఏ.నాగేశ్వరరావు, ఘటోత్కచునిగా ఎస్వీ రంగారావు, శశిరేఖగా సావిత్రి, బలరామునిగా గుమ్మడి, రేవతిగా ఛాయాదేవి, హిడింబగా సూర్యకాంతం, సుభద్రగా ఋష్యేంద్రమణి, రుక్మిణిగా సంధ్య, సాత్యకిగా నాగభూషణం, దుర్యోధనునిగా ముక్కామల, కర్ణునిగా మిక్కిలినేని, దుశ్శాసనునిగా ఆర్.నాగేశ్వరరావు, శకునిగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, లక్ష్మణ కుమారునిగా రేలంగి, సారథిగా బాలకృష్ణ. శాస్త్రిగా వంగర, శర్మగా అల్లు రామలింగయ్య, చిన్నమయ్యగా రమణారెడ్డి, లంబుగా చదలవాడ, జంబుగా నల్ల రామ్మూర్తి నటించారు. దారుకునిగా నటించి, గానం చేసినది మాధవపెద్ది సత్యం. చిన్నప్పటి శశిరేఖగా సచ్చు నటించింది. బాల అభిమన్యుడుగా ఆనంద్, చిన్నికృష్ణునిగా బాబ్జీ (పుష్పవల్లి తనయుడు) నటించారు. నిజానికి ఇంత భారీ తారాగణంతో మరో తెలుగు చిత్రం నిర్మితం కావలేదనే చెప్పాలి. అసలు సిసలు మల్టీస్టారర్స్ కు అర్థం చెప్పిన యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన ఈ పౌరాణికం విశేషాదరణ చూరగొంది.
ఇందులో ఎవరు హీరో అన్న అంశంపై కొందరు చర్చ పెడుతుంటారు. మొదటి పేరు యన్.టి.రామారావుది కాబట్టి నిస్సిందేహంగా ఆయనే ఈ చిత్రానికి నాయకుడు, కథానాయకుడు. అయితే శ్రీకృష్ణ పాత్రకు పాటలు లేవు కాబట్టి, అభిమన్యునికి పాటలు ఉన్నాయి కనుక ఏయన్నార్ ను హీరో అనేవారు కొందరు. అలాంటి వారి సందేహ నివృత్తి కోసమే అన్నట్టు చివరలో ఇది ఎల్ల శ్రీకృష్ణులవారి లీల... అంటూ ఘటోత్కచ పాత్ర ద్వారా చెప్పించడం, తరువాత శ్రీకృష్ణ స్తోత్రం పఠింప చేయడం శ్రీకృష్ణుడే అసలు కథానాయకుడు అని తేల్చిపారేశారు దర్శకులు కేవీ రెడ్డి. ఇక ఈ సినిమాలో శ్రీకృష్ణుని గెటప్ లో ఉన్న యన్టీఆర్ క్యాలెండర్లను తొలుత 40 వేల కాపీలు ముద్రించారు. తరువాత మరో పదివేలు, ఆ పై పెంచుకుంటూ పోయి ఆ రోజుల్లోనే లక్ష కాపీల క్యాలెండర్లు ముద్రించారు. వాటిని ఎంతోమంది అతిపవిత్రంగా దాచుకున్నారు. కొందరయితే, ఆ క్యాలెండర్ కు ఫ్రేమ్ కట్టించి, తమ ఇంటిలోని పూజామందిరాల్లో పెట్టుకున్నారు. ఈ చిత్రం ద్వారానే సింగీతం శ్రీనివాసరావు, కేవీ రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు.
తెలుగులో నటించిన యన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, సంధ్య తదితరులు తమిళంలోనూ నటించారు. తెలుగులో అభిమన్యునిగా ఏయన్నార్ నటించగా, తమిళంలో ఆ పాత్రను జెమినీ గణేశన్ అభినయించారు. రేలంగి పాత్రను తమిళంలో తంగవేలు చేశారు. తెలుగు చిత్రం 1957 మార్చి 27న విడుదల కాగా, తమిళ వర్షన్ అదే యేడాది ఏప్రిల్ 12న విడుదలయింది. రెండు భాషల్లోనూ మాయాబజార్ ఘనవిజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రం 24 కేంద్రాలలో శతదినోత్సవం, 4 సెంటర్స్ లో రజతోత్సవం జరుపుకుంది. ఇక రిపీట్ రన్స్ లో లెక్కలేనన్ని సార్లు విడుదలై, ప్రతీసారి వసూళ్ళ వర్షం కురిపించిందీ చిత్రం.
