Mass Maharaja Ravi Teja Gives Another Chance To Sudhir Varma: ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు.. అంత సులువుగా ఎవరికి పడితే ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వరు. తమకు ఫలానా దర్శకుడు హిట్ ఇవ్వగలడా? లేదా? అతని ట్రాక్ రికార్డ్ ఏంటి? అనే లెక్కలన్నీ బేరీజులు వేసుకొని.. అప్పుడు ముందడుగు వేస్తారు. తొందరపడి కమిటయ్యాక, అతడు ఫ్లాప్ ఇస్తే.. అది హీరోల కెరీర్‌పై ప్రభావం చూపుతుందా కదా! అందుకే, ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ.. కొందరు హీరోలు మాత్రం అందుకు భిన్నంగా దూసుకుపోతుంటారు. కొత్తవాళ్లకి అవకాశాలు ఇస్తారు. అలాగే.. ఒక దర్శకుడి కమిట్మెంట్ నచ్చి, ఇంకా ప్రాజెక్ట్ లైన్‌లో ఉండగానే అతనితోనే మరోసారి జోడీ కట్టేందుకు రెడీ అయిపోతుంటారు. అలాంటి హీరోల జాబితాలో మాస్ మహారాజా ఒకడు.
రవితేజ ఎంతమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనకు ఫ్లాప్ ఇచ్చిన వాళ్లకు సైతం మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దర్శకుడు సుధీర్ వర్మకి కూడా ఈ మాజ్ మహారాజా మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. వీరి కాంబోలో ప్రస్తుతం ‘రావణాసుర’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! ఇంకా ఈ సినిమా నిర్మాణ దశలోనే ఉంది. ఈ గ్యాప్‌లోనే ఆ డైరెక్టర్ రవితేజకి ఒక స్టోరీ వినిపించాడని, అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలొస్తున్నాయి. కేవలం ఆ స్టోరీ నచ్చడమే కాదండోయ్.. ‘రావణాసుర’ సినిమాని సుధీర్ వర్మ డీల్ చేస్తున్న విధానం, బడ్జెట్ & సమయం విషయంలో వేసుకుంటున్న ప్లానింగ్‌కి ఫిదా అయి, అతనితో మరో సినిమా చేసేందుకు రవితేజ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ముగించుకున్నాక, మళ్లీ ఇద్దరు కలిసి సెట్స్‌పైకి వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది.
కాగా.. రావణాసుర సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీకి, రవితేజ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇందులో రవితేజ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కార్, పూజిత పొన్నాడలు నటిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్దుల్లా పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
