NTV Telugu Site icon

Telugu Indian Idol: మణిశర్మ గెస్ట్ గా మదర్స్ డే స్పెషల్!

Mani Sharma Indian Idol

Mani Sharma Indian Idol

తెలుగు ఇండియన్ ఐడిల్ 20 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వారాంతంలో మదర్స్ డే ను పురస్కరించుకుని మెలోడీ బ్రహ్మ మణిశర్మను అతిథిగా ఆహ్వానించి, ఫ్యామిలీ స్పెషల్ ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. తెలుగు ఇండియన్ ఐడిల్ జడ్జీల్లో ఒకరైన నిత్యా మీనన్ తనదైన శైలిలో మణిశర్మను ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానించగా, మిగిలిన ఇద్దరు న్యాయ నిర్ణేతలు తమన్, కార్తీక్ మణిశర్మతో పాటు కలిసి పాటకు స్టెప్పులేశారు. మణిశర్మ గెస్ట్ గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్స్ సైతం ఉత్సాహంగా పాటతో ఆహ్వానించారు. గత వారం తిరుపతికి చెందిన మాన్య ఎలిమినేట్ కావడంతో ఈ వారం రెండు ఎపిసోడ్స్ లో మొత్తం తొమ్మిది మంది గాయనీ గాయకులు తమ ప్రతిభను చాటి వ్యూవర్స్ నుండి ఓట్లను కోరారు.

అమ్మలకు ప్రత్యేక ఆహ్వానం!
మణిశర్మను అందరూ మెలోడీ బ్రహ్మా అంటారు…. అయితే తెలుగు ఇండియన్ ఐడిల్ హోస్ట్ శ్రీరామచంద్ర మాత్రం ఆయన్ని తెలుగు మ్యూజిక్ ఐడిల్ అని పేర్కొన్నాడు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్స్ మదర్స్ ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని తమన్, కార్తీక్ తెలిపారు. తనతో ఎక్కువ పాటలు పాడించి, తెలుగువారికి చేరువ చేశారని కార్తీక్ చెప్పగా, మణిశర్మ లేకపోతే తాను లేనని అన్నాడు తమన్. ఆయన దగ్గర ప్రోగ్రామర్ గా పని చేసిన సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, తాను క్రికెటర్ ను కావడం వల్లే మణిశర్మ బృందంలో చోటు పొందానని తెలిపాడు. మణిశర్మ అప్పట్లో గల్లీ క్రికెట్ సూపర్ గా ఆడేవారని కితాబిచ్చాడు.

మణిశర్మ పాటలతో సరదా సరదాగా…
శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో తొలుత లాలస ‘పోకిరి’ సినిమాలోని ‘డోలె డోలె జర జర జరా’ పాటను చెవుల కింపుగా గానం చేసింది. ఆమె వాయిస్ కల్చర్ ను మణిశర్మ మెచ్చుకున్నారు. ఈ పాటకు ట్యూన్ కంటే ముందు రిథమ్ వచ్చిందని ఆనాటి రోజుల్ని తలుచుకున్నారు. ఆ తర్వాత రేణు కుమార్ ‘మురారి’ సినిమాలోని ‘బంగారు కళ్ళ బుజ్జమ్మో’ పాటను పాడాడు. శ్రుతి సరిగానే ఉన్నా పాట మధ్యలో కొన్ని సంగతులు మిస్ అయ్యాయని మణిశర్మ అన్నారు. పాట పాడిన అనంతరం రేణు ఎంత కష్టపడి పైకి వచ్చాడో మణిశర్మకు తమన్ తెలిపాడు. పిల్లాడి చదువుకు డబ్బులు లేకపోవడంతో రెండో తరగతి మళ్ళీ చదివిస్తున్నానని రేణు చెప్పడంతో మరో మూడేళ్ళ పాటు ఆ పిల్లాడి చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని తమన్ హామీ ఇచ్చాడు. వేణు తల్లితో పాటు భార్య రమ్యనూ నిర్వాహకులు వేదికపైకి పిలిచారు. ఇయర్ ఫోన్స్ లేక రేణు సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడని ఆమె చెప్పడంతో బెస్ట్ ఇయర్ ఫోన్స్ తాను కొనిస్తానని శ్రీరామచంద్ర అన్నాడు. మరో సంవత్సరం తర్వాత రేణు ఏ స్థాయిలో ఉంటాడో చూసుకోమని చెప్పాడు తమన్.

ఐటమ్ సాంగ్ లోనూ మేటర్!
మూడో కంటెస్టెంట్ గా వచ్చిన అదితి భావరాజు తాజా చిత్రం ‘ఆచార్య’లోని ‘కల్లోలం కల్లోలం…’ పాటను పాడింది. ఇది ఐటమ్ సాంగే అయినా చాలా మేటర్ ఉంటుందని, అది తనకు అలవాటని మణిశర్మ అన్నారు. ఈ పాట పాడటం సానా కష్టమని కానీ దానిని అదితి సులువుగా పాడేసిందని కితాబిచ్చారు. ఆ తర్వాత వచ్చిన జయంత్ ‘గుడుంబా శంకర్’లోని ‘చిలకమ్మ ముక్కుకి…’ పాటను పాడాడు. ఈ సినిమాలోని పాటలన్నింటినీ కేవలం రెండు రోజుల్లో బాణీలు కట్టేశానని మణిశర్మ తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన స్టూడియోకు వచ్చి… ట్యూన్ కు అనుగుణంగా స్టెప్పులేశారని చెప్పారు మణిశర్మ. ఆ తర్వాత జయంత్ తన తల్లిని గురించి చెబుతూ, ‘ఆమె తన దేవత అని, ఆమే తన బలం, బలహీనత’ అని అన్నాడు. ఆ మాటకు నిత్యామీనన్ ఫిదా అయిపోయింది. తల్లికి జయంత్ చక్కని నిర్వచనం ఇచ్చాడంటూ అభినందించింది. అనంతరం తమన్ గురించి ఆమె తల్లి మాట్లాడిన వీడియోను నిర్వాహకులు ప్లే చేశారు. పిన్నవయసులోనే తండ్రిని పోగొట్టుకున్న తమన్ ఎంతో కేరింగ్ తో తమని చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఈ ఎపిసోడ్ లో చివరగా ‘మగువా మగువా… ‘ గీతాన్ని ప్లేబ్యాక్ సింగర్స్ పాడారు.

అమ్మ పాటతో ఏడిపించిన శ్రీనివాస్!
శనివారం ఎపిసోడ్ వాగ్దేవి పాటతో మొదలైంది. ఆమె ‘అర్జున్’ సినిమాలోని ‘మధుర మధుర మీనాక్షి’ గీతాన్ని పాడి అందరి అభినందనలూ అందుకుంది. ఆ పాటను కంపోజ్ చేసిన సందర్భాన్ని, అందులోని ప్రత్యేకతను మణిశర్మ తలుచుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ ‘చూడాలని ఉంది’లోని ‘యమహా నగరి కలకత్తా పురి’ గీతాన్ని పాడాడు. అయితే అది అప్ టూ ద మార్క్ లేదని న్యాయనిర్ణేతలు పెదవి విరిచారు. ఆ తర్వాత శ్రీనివాస్ చనిపోయిన తన తల్లిని తలుచుకుంటూ అమ్మ మీద పాట పాడటంతో అంతా కన్నీరు పెట్టుకున్నారు. పార్టిసిపెంట్స్ మదర్స్ అంతా స్టేజ్ మీదకు వచ్చి తామున్నామంటూ శ్రీనివాస్ ను ఓదార్చి, కన్నీరు తుడిచారు. ఆ తర్వాత నిత్యామీనన్ తల్లి… తన కూతురు గురించి చెప్పిన వీడియోను ప్లే చేశారు. ‘తల్లిదండ్రులకు తానొక్కదాన్నే సంతామని, అందువల్ల తమ ముగ్గురి మధ్య గట్టి బాండింగ్ ఉంటుంద’ని నిత్యామీనన్ చెప్పింది. తల్లిని స్వయంగా కలుసుకునేందుకు వెళుతున్నానంటూ ఆమె షో నుండి సెలవు తీసుకుంది.

ఏడవ కంటెస్టెంట్ గా వచ్చిన ప్రణతి ‘చిరుత’ మూవీలోని ‘ఝుంకా ఝుంకా ఝుంకారే’ పాటను సూపర్బ్ గా పాడింది. ఆమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన న్యాయనిర్ణేతలు, మణిశర్మ కలిసి ‘బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అంటూ అభినందించారు. ఆ తర్వాత మారుతి ‘పరుగు’ సినిమాలోని ‘నమ్మవేమో కానీ అందాల యువరాణి’ పాటను పాడాడు. సినిమాలో ఈ పాటను పాడిన సాకేత్ మళ్ళీ తనను ఇంతవరకూ కలవలేదని, అది మిస్టరీగా ఉందని మణిశర్మ అన్నారు. ఆ తర్వాత వైష్ణవి ‘జంటిల్ మ్యాన్’లోని ‘గుసగుసలాడే పదనిసలేవో’ గీతాన్ని పాడింది. ఆమె పాటను విన్న మణిశర్మ బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఇదే సమయంలో వైష్ణవికి ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశం ఇవ్వమంటూ ఇటు తమన్, అటు కార్తీక్ కూడా కోరడంతో సై అన్నారు మణిశర్మ.

కార్తిక్ నుండి డివోషనల్ ఆల్బమ్!
చివరి కంటెస్టెంట్ పాడేసిన తర్వాత కార్తీక్ మదర్ కు సంబంధించిన వీడియో బైట్ ను ప్లే చేశారు. తన కొడుకు కార్తీక్ ఎంతో గొప్ప గాయకుడని, అయితే అతను భక్తి గీతాలు కూడా పాడితే వినాలని ఉందని ఆమె అన్నారు. వెంటనే ఆ భక్తి గీతాలకు తాను సంగీతం అందిస్తానని, ‘అరుణాచల శివ’ పేరుతో ఆల్బమ్ తీసుకువద్దామని మణిశర్మ అన్నారు. మణిసార్ ఇచ్చే ట్యూన్స్ కు తాను ప్రోగ్రామింగ్ చేస్తానని తమన్ హామీ ఇచ్చాడు. ఇదే వేదిక మీద తొలి సీడీని విడుదల చేద్దామని, తాను అప్పుడు మరోసారి వస్తానని మణిశర్మ అన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా అమ్మ పాటతో మెడ్లీ చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ వారం బెస్ట్ పెర్ఫార్మర్ గా వైష్ణవి ఎంపికై గిఫ్ట్ హ్యాంపర్ ను అందుకుంది. ఇక రాబోయే ఎపిసోడ్ ఎలిమినేషన్ కు సంబంధించింది కావడంతో సింగర్స్ అంతా గట్టిగా ప్రాక్టీస్ చేయక తప్పదు!