Mani Ratnam vs RGV: టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలు, తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. జూలై 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శక దిగ్గజాలు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. మణిరత్నం, ఆర్జీవీ ఇద్దరూ ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, ఆర్జీవీ నుంచి స్ఫూర్తి పొందిన ఫిల్మ్ మేకర్స్ సంఖ్య ఎక్కువగా ఉందని అజయ్ భూపతి అన్నారు. దీనికి కారణం మణిరత్నం సినిమాలు చాలా క్లిష్టమైన స్థాయిలో ఉంటాయని, వాటిని చూసి స్ఫూర్తి పొందాలంటే ప్రత్యేకమైన విజన్ అవసరమవుతుందని చెప్పారు. “మణిరత్నం సినిమాలు చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి కానీ, మనం కూడా అలాంటి సినిమా చేయగలమా అనే సందేహం వస్తుంది. అదే ఆర్జీవీ సినిమాలు చూస్తే ‘ఇది మనం కూడా చేయగలం’ అనే నమ్మకం కలుగుతుంది. ఆయన సినిమాల్లోని సింప్లిసిటీనే అసలైన కష్టం” అని అజయ్ భూపతి వెల్లడించారు.
అలాగే ఆర్జీవీ స్కూల్ నుంచి చాలా మంది దర్శకులు వచ్చారని ఆయన తెలిపారు. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి పలువురు దర్శకులు కూడా ఆర్జీవీ ప్రభావంతో తమదైన శైలిని ఏర్పరుచుకున్నారని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమా తనపై తీవ్ర ప్రభావం చూపించిందని అజయ్ భూపతి వెల్లడించారు. “సత్య సినిమా నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చింది. ఈ సినిమా చూడకపోతే నేను వేరే జోనర్‌లో సినిమాలు చేసే వాడినేమో. కానీ ఆ సినిమా చూసిన తర్వాత రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ వైపు నా ఆలోచనలు మారాయి” అని అన్నారు. ఒక సినిమా విజయాన్ని తిరిగి అదే విధంగా సృష్టించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “ఒక సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా, అదే నటీనటులు, అదే టెక్నీషియన్స్ ఉన్నా.. అదే సినిమా మళ్లీ చేయలేం. ఎందుకంటే ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన ప్రాసెస్‌లో పుడుతుంది” అని అన్నారు. తన సినిమాల విషయంలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తానని చెప్పారు. ‘RX100’ చిత్రాన్ని కేవలం రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేశామని, ఒక నెల షూటింగ్ తర్వాత హీరో లుక్ కోసం గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్ పూర్తి చేశామని గుర్తుచేశారు.
తనకు ఇష్టమైన సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ ‘సత్య’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’, కృష్ణవంశీ ‘గులాబీ’, బాపు సినిమాలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ముఖ్యంగా కృష్ణవంశీ సినిమాల వల్ల గోదావరి ప్రాంతంపై తన దృష్టి మారిందని చెప్పారు. “నేను గోదావరి ప్రాంతంలో పెరిగాను. కానీ కృష్ణవంశీ సినిమాలు చూసిన తర్వాత గోదావరిని చూసే విధానం మారిపోయింది. ఆయన సినిమాల్లోని పాత్రలు, కథలు గోదావరి ఇసుక తిన్నెల నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపిస్తాయి” అని అజయ్ భూపతి అన్నారు. ఇక ఇటీవల తనను బాగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘తుంబాద్’, ‘కేజీఎఫ్’ కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ నరేషన్ స్టైల్, ట్రీట్‌మెంట్ తనకు చాలా నచ్చిందని అన్నారు.

