బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది వారాలుగా ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి స్టార్‌లు విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు. వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను కూడా ఈడీ ప్రశ్నించింది. ఈ కేసు మూలాలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అనధికారికంగా జరిగిన, భారీ స్థాయి డబ్బు లావాదేవీల్లో ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దేశం లోపల, బయటకు కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా, డబ్బు పంపిణీ, చెల్లింపులు, ప్రమోషనల్ ఈవెంట్స్, బ్రాండ్ ఎంటర్స్‌మెంట్‌లలో భాగస్వామ్యంపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా..
ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వరుసగా విచారణకు హాజరవుతుండగా, నేడు (ఆగస్టు 13) నటి మంచు లక్ష్మీ కూడా ఈడీ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతారని సమాచారం. అయితే ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, మంచు లక్ష్మిని ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసిన ఈవెంట్స్, సంబంధిత వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల పై ప్రశ్నించనున్నారు. ఇంత వరకు విచారణకు హాజరైనవారు తాము ఈ యాప్ యొక్క మనీలాండరింగ్ అంశాల గురించి తెలియదని స్పష్టంచేసినప్పటికీ, అధికారులు ఆర్థిక డాక్యుమెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
