Site icon NTV Telugu

MSVG: ‘మన శంకరవరప్రసాద్ గారు’కి తృటిలో తప్పిన రేట్ల టెన్షన్

Manashankar Varaprsad Garu

Manashankar Varaprsad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు చర్చనీయాంశమయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా
జనవరి 12న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయం ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడం, పండగ సీజన్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఈ ధరల పెంపు ఉందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ ప్రజలపై భారం పడేలా ధరలు పెంచడం సరికాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: Maruthi : ఈ రోజు నుంచి నేను ఫీలయిన ప్రభాస్ ని చూపించబోతున్నాం!

ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరగా, హైకోర్టు అందుకు నిరాకరించి, సెలవు దినాల్లో హౌస్ మోషన్ విచారణ చేపట్టలేమని, కోర్టు పని దినాల్లోనే పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఈనెల 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది విజయ్ గోపాల్ పేర్కొన్నారు. కోర్టు సెలవులలో ఉండడంతో ప్రస్తుతానికి సంక్రాంతి విడుదల సమయంలో సినిమా యూనిట్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం స్పెషల్ ప్రీమియర్ (జనవరి 11): రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య జరిగే ఈ షో టికెట్ ధర రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. జనవరి 12 నుండి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున అదనంగా పెంచుకోవచ్చు అని పేర్కొన్నారు.

Exit mobile version