Site icon NTV Telugu

Chiranjeevi: సంక్రాంతి ముందే ‘మెగా’ సునామీ: లక్షల్లో చిరు సినిమా టికెట్లు!

Manashankara Varaprasadgaru

Manashankara Varaprasadgaru

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వకముందే.. ‘మెగా’ మేనియా మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. కేవలం థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకలకే పరిమితం కాకుండా, ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్, ఆయన వెండితెరపై కనిపిస్తే వచ్చే పూనకాలు వేరు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం అభిమానులు ఏకంగా లక్షలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా ఫ్యాన్స్ నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా రూ. 1,11,111 (లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) వెచ్చించి సినిమా తొలి టికెట్‌ను సొంతం చేసుకున్నారు, తన అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనే ఆరాటంతో ఆయన ఈ స్థాయి ధరకు వెనుకాడలేదు.

Also Read: Mega 158: సర్జరీ ఎఫెక్ట్.. మారిన మెగా ప్లాన్?

మరోవైపు నరసాపురంలోని ప్రముఖ థియేటర్ ‘అన్నపూర్ణ’లో జరిగిన వేలం కూడా మొదటి టికెట్ ధర రూ. 1,02,000 (లక్షా రెండు వేలు) పలికింది. ఒక సామాన్యమైన సినిమా టికెట్ ఈ స్థాయిలో ధర పలకడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అభిమానులు తమ సొంతానికి వాడుకోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, అదేమంటే వేలంలో పోగైన ఈ భారీ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT)కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిరంజీవి తన సినిమాల ద్వారానే కాకుండా, బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు మద్దతుగా ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాలోని వింటేజ్ చిరు మార్క్ కామెడీని, యాక్షన్‌ను గుర్తుచేస్తున్నాయి.

Exit mobile version