NTV Telugu Site icon

Mamta Mohandas: దానికి లొంగిపోలేదంటూ.. మమతా స్ట్రాంగ్ కౌంటర్

Mamta Mohandas

Mamta Mohandas

Mamta Mohandas Gives Clarity On Rumours: నటి మమతా మోహన్‌దాస్ గుర్తుందా? ‘యమదొంగ’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ, మొదట్లో కొన్నాళ్లు బాగానే సందడి చేసింది. అయితే.. ఆ తర్వాత క్యాన్సర్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఆ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, తన ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడి, చివరికి గెలిచింది. క్యాన్సర్ నుంచి బయడపడ్డాక, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ, తన సెకండ్ ఇన్నింగ్స్‌ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

అయితే.. కొన్ని రోజుల నుంచి మమతా ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆ అమ్మడు మరోసారి క్యాన్సర్ బారిన పడిందని, రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రచారం జరుగుతోంది. మునుపటిలాగా క్యాన్సర్‌తో పోరాటే శక్తి లేకపోవడంతో.. ఆ వ్యాధికి మమతా లొంగిపోయిందని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మమతా ఈ వార్తలపై తాజాగా స్పందించింది. తాను మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదని, చాలా ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసింది. అంతేకాదు.. తాను తన పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని, క్లిక్కుల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాయకుండా మీరు కూడా మీ పని చేసుకుంటే బాగుంటుందని గాసిప్‌రాయుళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

‘‘నేను మళ్లీ క్యాన్సర్ బారిన పడినట్టు వస్తున్న ఫేక్ వార్తలు చూసి.. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. నాకు వాళ్ల దగ్గర నుంచి మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి. నేను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో నేను మరోసారి క్యాన్సర్ బారిన పడ్డానని, ఈసారి ఫైట్ చేసే శక్తి లేక దానికి లొంగిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ వార్తలను నమ్మకండి’’ అంటూ ఇన్‌స్టాలో మమతా క్లారిటీ ఇచ్చింది. అలాగే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పేందుకు తాజా ఫోటోలను సైతం ఇన్‌స్టాలో షేర్ చేసింది.

తనపై గతంలోనూ ఇలాంటి వార్తలు చాలా వచ్చాయని, ఇప్పుడు మరింత పెచ్చుమీరిపోయాయని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను ఇలా స్పందించాల్సి వస్తోందని మమతా పేర్కొంది. ఇప్పుడు మీకు సమాధానం దొరికింది కాబట్టి, నా మీద తప్పుడు వార్తలు రాయడం మానేసి మీ పనులు చూసుకోండని గాసిప్స్ రాసే వారికి గట్టిగా సమాధానం ఇచ్చింది. తనలాగే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితం విలువ ఏంటో అందరికీ తెలుస్తుందని హితవు పలికింది.