NTV Telugu Site icon

మ‌న‌సున మ‌ల్లెల మాల‌లూగించిన‌ మ‌ల్లీశ్వ‌రికి 70 ఏళ్ళు

Malliswari

తెలుగు చిత్ర‌సీమ‌లో పాట‌ల పందిరి అన్న మాట‌కు మొట్ట‌మొద‌ట అంకురార్ప‌ణ చేసిన చిత్రంగా వాహినీ వారి మ‌ల్లీశ్వ‌రి నిల‌చింది. 1951 డిసెంబ‌ర్ 20న విడుద‌లైన మ‌ల్లీశ్వ‌రి చిత్రం క‌ళాభిమానుల‌కు ఆనందం పంచుతూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మ‌హాన‌టుడు య‌న్టీఆర్, మ‌హాన‌టి భానుమ‌తి న‌ట‌నావైభ‌వానికి మ‌చ్చుతున‌క‌గా మ‌ల్లీశ్వ‌రి నిల‌చింది. 1951 మార్చి 15న విడుద‌లైన పాతాళ‌భైర‌వి చిత్రం య‌న్టీఆర్ ను సూప‌ర్ స్టార్ గా నిలిపితే, ఆయ‌న‌లోని న‌ట‌న‌ను వెలికి తీసిన చిత్రంగా మ‌ల్లీశ్వ‌రి నిల‌చింది. ఈ చిత్రం విడుద‌లై 70 వ‌సంతాలు పూర్త‌వుతున్నా, ఈ నాటికీ చిత్ర‌సీమ‌లోని సాహిత్యం అన‌గానే అంద‌రూ ముందుగా గుర్తు చేసుకొనే చిత్రంగా మ‌ల్లీశ్వ‌రి నిల‌చింది. అందుకు కార‌ణం ఈ చిత్ర రూప‌శిల్పి బి.య‌న్.రెడ్డి అనే చెప్పాలి. ఆయ‌న అభిరుచికి త‌గ్గ రీతిలో క‌థ‌,ర‌చ‌న‌, సంగీతం, సాహిత్యం, న‌టీన‌టుల అభిన‌యం అన్నీ కుదిరాయి. వైవిధ్యం అంటూ అడ్డ‌గోలు క్రైమ్ క‌థ‌ల‌ను తెర‌కెక్కిస్తున్న ఈ నాటి సినీజ‌నం మ‌ల్లీశ్వ‌రిని చూసి ఎంత‌యినా నేర్చుకోవ‌ల‌సి ఉంద‌ని విజ్ఞులు అనేక వేదిక‌ల‌పై విన్న‌విస్తూనే ఉన్నారు. వైవిద్యాన్ని ఆశించే న‌వ‌త‌రం ప్రేక్ష‌కులు సైతం మ‌ల్లీశ్వ‌రిని ఒక్క‌మారు చూస్తే, సినిమాల్లోనూ క‌ళాత్మ‌క విలువలు, చారిత్రకాంశాల‌ను పొందుప‌ర‌చిన తీరు, న‌టీనటుల నుండి న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్న వైనం, సాంకేతిక నిపుణుల ద‌గ్గ‌ర నుండి క‌ళాత్మ‌క హృద‌యాల‌ను క‌దిలించే ఆ యా శాఖ‌ల వారి ప్రావీణ్యాన్ని వెలికి తీసిన విధానం అన్నీ మ‌న మ‌న‌సుల‌ను క‌ట్టి ప‌డేస్తాయి. ఈ చిత్రంలో ఉన్న‌ట్టుగా మ‌న‌సున మ‌ల్లెల మాల‌ల‌ను ఊగిస్తాయి.

ఆ ఘ‌న‌త ఆయ‌న‌దే!
మ‌ల్లీశ్వ‌రిని అద్భుతంగా తీర్చిదిద్దిన బి.య‌న్.రెడ్డికే ఈ సినిమా ఘ‌న‌త అంతా ద‌క్కుతుంద‌ని, ఈ చిత్రం ద్వారా సినిమా రంగంలో అడుగు పెట్టిన ప్ర‌ముఖ భావ‌క‌వి దేవుల‌ప‌ల్లి వేంక‌ట కృష్ణ‌శాస్త్రి ఏ నాడో అన్నారు. అదే తీరున య‌న్టీఆర్, భానుమ‌తి కూడా మ‌ల్లీశ్వ‌రి అపురూప చిత్రంగా నిల‌వ‌డానికి బి.య‌న్.రెడ్డి ఒక్క‌రే కార‌కులు అనేవారు. బి.య‌న్. మాత్రం అది స‌మ‌ష్టి కృషి, ఈ చిత్రానికి ప‌నిచేసిన ఏ ఒక్క‌రు త‌న‌కు ల‌భించ‌క పోయినా, మ‌ల్లీశ్వ‌రి ఇంత‌లా జ‌నాన్ని హ‌త్తుకొనేది కాద‌ని అని విన‌మ్రంగా విన్న‌వించేవారు. మ‌ల్లీశ్వ‌రి చిత్రం 1951లో జ‌నం ముందు నిల‌చినా, ఆ చిత్ర‌రూప‌క‌ల్ప‌న‌కు 1939లోనే అంకురార్ప‌ణ జ‌రిగింది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బి.య‌న్.రెడ్డి హంపి క్షేత్రాన్ని సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో విరూపాక్ష స్వామి వారి ఆల‌యంలో దేవునికి న‌మ‌స్క‌రిస్తూ ఉండ‌గా, ఆయ‌న మ‌దిలో ఓ భావ‌న మెదిలింది. అదే స్వామి వారిని అదే ఆల‌యంలో శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు సైతం త‌న‌లాగే న‌మ‌స్క‌రించి ఉంటారు క‌దా అన్న‌దే ఆ భావ‌న‌. అప్పుడే కృష్ణ‌దేవ‌రాయల పాల‌న నేప‌థ్యంలో ఓ చిత్రం తీయాల‌న్న ఆలోచ‌న బి.య‌న్.లో క‌లిగింది. మ‌ద‌రాసు వ‌చ్చాక ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ప్ర‌ముఖ ర‌చ‌యిత బుచ్చిబాబు రాసిన
రాయ‌ల క‌రుణ‌కృత్యం అనే క‌థ ఆయ‌న‌ను ఆక‌ర్షించింది.

ఆ త‌రువాత దేవ‌న్ శ‌రార్ రాసిన చిన్న క‌థ ది ఎంప‌ర‌ర్ అండ్ ద స్లేవ్ గ‌ర్ల్ కూడా బి.య‌న్.ను ఆక‌ర్షించాయి. ఆ రెండు క‌థ‌ల‌ను మిళితం చేసి మ‌ల్లీశ్వ‌రి క‌థ‌ను త‌న మ‌దిలో రూపుక‌ట్టుకున్నారు బి.య‌న్. అప్ప‌టికే ఆంధ్ర‌దేశంలో త‌న భావ‌క‌విత్వంతో పాఠ‌క‌లోకాన్ని ఓ ఊపు ఊపేస్తున్నారు దేవుల‌ప‌ల్లి వేంక‌టకృష్ణ శాస్త్రి. ఆయ‌న‌తో ఎలాగైనా త‌న మ‌ల్లీశ్వ‌రికి ర‌చ‌న చేయించాల‌ని భావించారు బి.య‌న్. దేవుల‌ప‌ల్లిని ఆహ్వానించారు. సినిమా రంగంలో ప్ర‌వేశించ‌డానికి దేవుల‌ప‌ల్లి అప్ప‌టికి అంత సుముఖంగా లేరు. అయితే బి.య‌న్. తాను అనుకున్న మ‌ల్లీశ్వ‌రి క‌థ విన్న త‌రువాత దేవుల‌ప‌ల్లి త‌ప్పకుండా ఆ చిత్రానికి ర‌చ‌న చేస్తాన‌ని మాట ఇచ్చారు. అస‌లే రాయ‌లు కవిరాజు అందువ‌ల్ల‌, ర‌ణ‌రంగ ధీరుల‌కే కాదు, సాహితీ యోధుల‌కు సైతం కృష్ణ‌దేవ‌రాయ‌లంటే ఎంతో అభిమానం. అదే విధంగా దేవుల‌ప‌ల్లివారు కూడా మ‌ల్లీశ్వ‌రిని త‌న సాహితీవైభ‌వంతో తీర్చి దిద్దారు. అల‌తి అల‌తి ప‌దాల‌తో క‌విత‌ల‌ల్ల‌డ‌మే అస‌లైన పాండిత్యం అని లోకోక్తి. అందువ‌ల్ల దేవుల‌ప‌ల్లి మ‌ల్లీశ్వ‌రి ఆ అరుదైన సాహితీ ప్ర‌క్రియ‌నే ఎంచుకున్నారు. పైగా క‌థానుగుణంగా మ‌ల్లీశ్వ‌రి, ఆమె బావ నాగ‌రాజు ఇద్ద‌రూ ప‌ల్లెవాసులు. అందువ‌ల్ల వారి పాత్ర‌ల‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి, వారికి త‌గ్గ భాష‌ను ప‌లికించారు దేవుల‌ప‌ల్లి.

న‌ట‌వ‌ర్గం
త‌న స్వ‌ర్గ‌సీమ‌ చిత్రంతోనే న‌టిగా భానుమ‌తికి మంచి పేరు ల‌భించింది. అందువ‌ల్ల బి.య‌న్.రెడ్డి మ‌రో మాట లేకుండా మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌కు ఆమెను ఎంపిక చేసుకున్నారు. ఇక నాగరాజు పాత్ర‌కు ఆయ‌న మ‌న‌సులో మొద‌టినుంచీ య‌న్టీఆర్ ఉన్నారు. కానీ, అప్ప‌టికి య‌న్టీఆర్ విజ‌యా సంస్థ‌లో కాంట్రాక్ట్ యాక్ట‌ర్ గా ఉన్నారు. అంటే విజ‌య‌వారి అనుమ‌తి ఉంటేనే య‌న్టీఆర్ బ‌య‌టి చిత్రాల‌లో న‌టించ‌గ‌ల‌రు. ఎటూ విజ‌యా సంస్థ, వాహినీ వారి సోద‌ర‌సంస్థ కావున వారేమీ అడ్డు చెప్ప‌లేదు. ఇందులో అతి కీల‌క‌మైన జ‌ల‌జ పాత్ర‌కు టి.జి.క‌మ‌లాదేవిని ఎంచుకున్నారు. అప్ప‌టికే కొన్ని చిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషించిన క‌మ‌లాదేవి పాతాళ‌భైర‌విలో స‌త్రంలో కాల‌క్షేపం కోసం ఇతి హాసం విన్నారా...ఆ అతి సాహ‌సులే ఉన్నారా... అనే గీతంలో న‌టించారు. అందువ‌ల్ల ప్రేక్ష‌క లోకంలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. జ‌ల‌జ పాత్ర‌లో ఆమె రాణించ‌గ‌ల‌ర‌ని భావించారు బి.య‌న్. కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర కోసం శ్రీ‌వాత్స‌వ‌ను, అల్ల‌సాని పెద్ద‌న పాత్ర‌కు న్యాప‌తి రాఘ‌వ‌రావును ఎన్నుకున్నారు. మిగిలిన పాత్ర‌ల్లో కుమారి, ఋష్యేంద్ర మ‌ణి, సుర‌భి క‌మ‌లాబాయి, దొరై స్వామి, వంగ‌ర వెంక‌ట సుబ్బ‌య్య నిలిచారు. చిన్న‌ప్ప‌టి నాగ‌రాజుగా మాస్ట‌ర్ వెంక‌ట‌రమ‌ణ‌, చిన్న‌నాటి మ‌ల్లీశ్వ‌రిగా బేబీ మ‌ల్లిక న‌టించారు.

క‌థ ఏమిటంటే!?
పండిత‌పామ‌ర భేదం లేకుండా స‌ర్వుల‌నూ ఆక‌ర్షించిన మ‌ల్లీశ్వ‌రి చిత్ర క‌థ ఏమిటంటే – హంపి రాజ‌ధానిగా శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు రాజ్యం చేస్తున్న కాలంలో ఆయ‌న పాల‌నాప‌రిధిలోని వీరాపురం అనే గ్రామంలో క‌ళాకారులైన ప‌ద్మ‌శాలీయులు అధికంగా ఉండేవారు. దుస్తులు నేత నేయ‌డంలోనూ, శిల్పాలు మ‌ల‌చ‌డంలోనూ, ఆట‌పాట‌ల్లోనూ ఆరితేరిన వారు ఆ గ్రామ‌జ‌నం. అలాంటి ఓ రెండు కుటుంబాల‌కు చెందిన వారు నాగరాజు, మ‌ల్లీశ్వ‌రి. నాగ‌రాజు త‌ల్లి సొంత సోద‌రుని కూతురే మ‌ల్లీశ్వ‌రి. చిన్న‌త‌నం నుంచీ నాగ‌రాజు, మ‌ల్లీశ్వ‌రి ఎంతో అన్యోన్యంగా త‌మ ఊరి దేవాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటూ గ‌డిపేవారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని స్థితి వారిది. అయితే మ‌ల్లీశ్వ‌రి త‌ల్లికి మాత్రం నాగ‌రాజు లాంటి పేద‌వాడు త‌న‌కూతురుకు త‌గ‌డు అనే దృఢ‌మైన అభిప్రాయం ఉంటుంది. త‌న కూతురికి రాణివాసం యోగం ఉంద‌ని ఆమె అభిప్రాయం. రాణివాసం అంటే రాణుల అంతఃపురాల‌లో ఉండే అవ‌కాశం క‌ల‌గ‌డం. క‌ళ‌ల్లో ఆరితేరిన వారినీ, అంద‌గ‌త్తెల‌ను రాణులు త‌మ వాసానికి రప్పించుకొనేవారు.

వినోదం కోసం వారి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌తో సంతృప్తి చెందేవారు. ఒక‌సారి రాణివాసంలో అడుగుపెట్టిన అమ్మాయిల‌కు బ‌య‌ట ప్ర‌పంచం తెలియ‌రాదు. ముఖ్యంగా మ‌గ‌వాస‌న త‌గ‌ల‌రాదు. ఇదీ ఆ నాటి ఆచారం. ఈ ఆచారంలో ఎంత దుర్మార్గం ఉన్నా, కాసుల‌కు ఆశ‌ప‌డే క‌న్న‌వారు త‌మ బిడ్డ‌ల‌కు రాణివాసం ల‌భించాల‌నే ఆశించేవారు. ఎందుకంటే రాణుల‌తో స‌మానంగా త‌మ కూతుళ్ళ వైభోగం ఉంటుంద‌ని వారి అభిలాష‌. అదే తీరున మ‌ల్లి త‌ల్లి కూడా ఆశించేది. నాగ‌రాజు, మ‌ల్లీశ్వ‌రి పెరిగి పెద్ద అయిన త‌రువాత కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఓ సారి ఇద్ద‌రూ క‌ల‌సి ఎడ్ల బండిక‌ట్టుకొని తిర‌నాళ వెళ్ళారు. ఇంటికి వ‌స్తూ ఉండ‌గా, దారిలో వ‌ర్షం విజృంభించింది. దాంతో ఓ పాడుప‌డ్డ స‌త్రంలో త‌ల‌దాచుకున్నారు. అక్క‌డే శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు, పెద్ద‌న మారువేషాల‌లో వానదెబ్బ‌కు వ‌చ్చి చేరారు. అదే స‌మ‌యంలో మ‌ల్లీశ్వ‌రి త‌న బావ‌ను ఆనంద ప‌రుస్తూ పిలిచిన బిగువ‌ట‌రా... అంటూ నాట్యం చేసింది. అదిచూసిన మారువేషాల్లోని రాయ‌లు, పెద్ద‌న ఆనంద‌భ‌రితులై వారి వివ‌రాలు కోరారు. ఆ పెద్ద‌వారు ఎవ‌రో తెలియ‌ని నాగ‌రాజు స‌ర‌దాగా, మా మ‌ల్లీశ్వ‌రికి రాణివాసం మేనా పంపండి... అంటూ కొంటెగా అన్నాడు. మ‌ల్లీశ్వ‌రి బావ‌ను ఆట‌ప‌ట్టించింది. వారి స‌ర‌దా చూసి న‌వ్వుకున్న రాయ‌లు, పెద్ద‌న పోతూపోతూ ఉండ‌గా, మ‌రోమారు నాగరాజు రాణివాసం మేనా పంపడం మ‌ర‌చిపోకండి... అన్నాడు. వారు స‌రే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు.

వ‌య‌సొచ్చిన మ‌ల్లీశ్వ‌రి, బికారి నాగ‌రాజుతో తిరుగుతోంద‌ని త‌ల్లికి ఆగ్ర‌హం క‌లిగింది. నాగ‌రాజు లాంటివాడు త‌న బిడ్డ‌ను ఏం సుఖ‌పెట్ట‌గ‌ల‌డ‌ని నానా మాట‌లు అంది. దాంతో పౌరుషం వ‌చ్చిన నాగ‌రాజు త‌న‌కు ఉన్న శిల్ప‌క‌ళ‌తో సంపాదించుకొని వ‌స్తాన‌ని బ‌య‌లు దేరాడు. మ‌ల్లీశ్వ‌రి బావ జాడ తెలియ‌క వాపోయింది. మేఘాల‌నూ జాడ‌చెప్ప‌మ‌ని కోరింది. ఆమె ఆవేద‌న రోజురోజుకూ పెరుగుతూ పోయింది. నాగ‌రాజు త‌న శిల్ప‌క‌ళ‌తో బాగా సంపాదించ‌డం ఆరంభించాడు. ఈ లోగా మ‌ల్లీశ్వ‌రి రాణివాసం మేనా వ‌చ్చింది. రాజుల ఆజ్ఞ‌! త‌ప్ప‌దాయె. మ‌ల్లీశ్వ‌రి రాణివాసం పోయింది. ఆమె వెళ్లిన కొద్ది రోజుల‌కే నాగ‌రాజు బాగా సంపాదించుకొని వ‌చ్చాడు. మ‌ల్లీశ్వ‌రి రాణివాసం పోయింద‌ని తెలియ‌గానే అత‌ని గుండె ముక్క‌ల‌యింది. దేశం ప‌ట్టి పోయాడు. పిచ్చివాడుగా తిరిగాడు. అయితే క‌నిపించిన రాళ్ళ‌లో త‌న ప్రేయ‌సి బొమ్మ‌ను మ‌ల‌చుతూ కాలం గ‌డిపాడు.

అదే స‌మ‌యంలో రాయ‌ల‌వారు వ‌సంత‌మండ‌పం నిర్మించాల‌ని త‌ల‌పెట్టారు. అందుకోసం ప్ర‌ధాన శిల్పి, దేశ‌విదేశాల్లోని శిల్పుల‌ను సంప్ర‌దించారు. స‌రిగా అప్పుడే ఆయ‌న కంట నాగరాజు, అత‌ని శిల్ప‌క‌ళ ప‌డ్డాయి. పిచ్చివాడిగా ఉన్న నాగ‌రాజును త‌నతో తీసుకుపోయి, ప‌ని పుర‌మాయించారు ఆ ప్ర‌ధాన‌శిల్పి. కొత్త‌గా నిర్మిత‌మ‌వుతున్న భ‌వంతిని చూడ‌టానికి రాణివాసం క‌న్య‌లు వేంచేశారు. వారిలో కొంద‌రు ఆ శిల్పక‌న్య‌ల్లో మ‌ల్లీశ్వ‌రి పోలిక‌లు ఉన్నాయ‌ని చ‌ర్చించుకున్నారు. అది విని జ‌ల‌జ‌, మ‌ల్లీశ్వ‌రికి విష‌యం చెప్పింది. ఆమె వ‌చ్చిచూసి, అది త‌న బావ ప్ర‌తిభే అని భావించింది. అక్క‌డే త‌న బావ‌నూ చూసింది. జ‌ల‌జ హెచ్చ‌రిక‌తో అక్క‌డ ఏమీ మాట్లాడ‌లేదు. వారిరువురూ తుంగ‌భ‌ద్ర తీరంలో క‌లుసుకొనేలా అర్ధ‌రాత్రి ఏర్పాటు చేసింది జ‌లజ‌. బావ‌ను చేరుకున్న మ‌ల్లీశ్వ‌రికి మ‌ళ్ళీ రాణివాసం వెళ్ళ‌బుద్ధి కాలేదు. అయినా, వెళ్ళ‌లేక వెళ్ళ‌లేక వెళ్ళింది. త‌దుప‌రి మ‌రోమారు క‌ల‌వాల‌నుకున్నారు. అదే స‌మ‌యంలో రాణివారు వినోదం కోసం మ‌ల్లీశ్వ‌రి నాట్యం చూడ కోరారు. అనుకున్న స‌మ‌యానికి మ‌ల్లీశ్వ‌రి నాగ‌రాజును క‌లుసుకోలేక పోయింది. దాంతో త‌న మ‌ల్లీశ్వ‌రికి ఏమ‌యిందోన‌ని ఆత్రుత‌తోనాగ‌రాజు దొంగ‌లా కోట‌లో ప్ర‌వేశించాడు. భ‌టుల‌కు ప‌ట్టు ప‌డ్డాడు. అదే స‌మ‌యంలో మ‌ల్లీశ్వ‌రి త‌న బావ‌ను చూసింది. అత‌ణ్ణి తానే ర‌మ్మ‌న్నాన‌ని చెప్పింది. మ‌ల్లీశ్వ‌రికి ఎక్క‌డ శిక్ష ప‌డుతుందోన‌నే భ‌యంతో నాగ‌రాజు, ఆమె ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. మ‌ల్లీశ్వ‌రి దండ‌నాయ‌కుల‌తో తానే అస‌లుదోషిన‌ని చెప్పుకుంది. దాంతో ఇరువురినీ ఖైదు చేశారు. ఇద్ద‌రికీ మ‌ర‌ణ శిక్ష విధించారు. జ‌ల‌జ ద్వారా మ‌ల్లీశ్వ‌రి, నాగ‌రాజు ప్రేమ‌క‌థ తెలుసుకున్న రాణి తిరుమ‌లాంబ‌, రాయ‌లుకు విష‌యం చెప్పింది. దాంతో మ‌ల్లీశ్వ‌రి, నాగ‌రాజును స‌భ‌కు పిలిపించారు రాయ‌లు. నాగ‌రాజు, మ‌ల్లీశ్వ‌రి ఒకరిని ఒక‌రు కాపాడు కోవ‌డం కోసం త‌ప్పు త‌న‌దంటే త‌న‌ద‌ని త‌మ‌పై నేరం మోపుకున్నారు. అంత‌టికీ రాణివాసం కార‌ణ‌మ‌ని తేలింది. రాణివాసం ప‌ల్ల‌కీ పంప‌డ‌మే త‌ప్పా అంటూ నిల‌దీశారు రాయ‌లు.

అస‌లు త‌మ బోటి వారికి రాణివాసం ఎక్క‌డ నుండి వ‌స్తుంద‌ని నాగ‌రాజు అన్నాడు. బాగా ఆలోచించుకో, నీవే మ‌మ్మ‌ల్ని రాణివాసం ప‌ల్ల‌కీ పంప‌మ‌న్నావేమో? అన్నారు రాయ‌లు. అంత సాహ‌సం చేయ‌గ‌ల‌నా ప్ర‌భూ అని నాగ‌రాజు అయోమ‌యంలో ప‌డ్డాడు. అదే స‌మ‌యానికి ప‌ద్యాలు వ‌ల్లిస్తూ వ‌చ్చిన పెద్ద‌న‌ను నాగ‌రాజు గుర్తు పట్టాడు. అప్పుడు తెలిసింది త‌న త‌ప్పిదం. దాంతో త‌ప్పు త‌న‌దే కాబ‌ట్టి, త‌న‌ను ఉరి తీయ‌మ‌ని వేడుకున్నాడు. కాదు, త‌న‌వ‌ల్లే బావ కోట‌లో ప్ర‌వేశించాడు కాబ‌ట్టి త‌న‌కు మ‌ర‌ణ‌దండ‌న విధించమ‌ని మ‌ల్లి కోరింది. దాంతో రాయ‌ల‌వారు సందిగ్ధంలో ప‌డ్డారు. చివ‌ర‌కు త‌న గానంతోనూ, నృత్యంతోనూ త‌మ‌కు ఆనందం క‌లిగించిన మ‌ల్లీశ్వ‌రిని, అలాగే త‌న శిల్ప‌క‌ళ‌తో త‌మ మండ‌పానికి ఓ క‌ళ తీసుకు వ‌చ్చిన నాగ‌రాజును క్ష‌మించి వ‌ద‌లివేస్తున్నామ‌ని రాయ‌ల‌వారు చెప్పారు. ఆయ‌న క‌రుణ‌కృత్యాన్ని త‌ల‌చుకుంటూ నాగ‌రాజు, మ‌ల్లీశ్వ‌రి స్వ‌స్థ‌లం చేరుకున్నారు. వారి వివాహం జ‌రిగింది. ఎప్ప‌టిలాగే బావ‌మ‌ర‌ద‌ళ్ళు ఆడుతూ పాడుతూ గుడి ప్రాంగ‌ణంలో సంద‌డిచేయ‌సాగారు.

ఈ క‌థ‌ను బి.య‌న్.రెడ్డి త‌న క‌ళాత్మ‌క హృద‌యంతో అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ఆయ‌న మ‌నోఫ‌ల‌కంపైని చిత్రాన్ని చ‌దివిన వారిలాగే దేవుప‌ల్లి వేంక‌టకృష్ణ‌శాస్త్రి ర‌చ‌న చేయ‌గా, ఆయ‌న రాసిన పాట‌ల‌కు సాలూరి రాజేశ్వ‌ర‌రావు మ‌ర‌పురాని బాణీల‌తో మ‌ధురం పంచారు. ఆది ఎమ్.ఇరానీతో క‌ల‌సి బి.య‌న్.రెడ్డి చిన్న త‌మ్ముడు బి.కొండారెడ్డి ఈ క‌థ‌ను కెమెరాలో బంధించి, ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేశారు. ఇక న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు త‌మ క‌ళ‌ల‌తో మ‌ల్లీశ్వ‌రికి ప్రాణం పోశారు. ప్ర‌తి క‌ద‌లిక‌లోనూ బి.య‌న్. క‌ళాత్మ‌క హృద‌య‌మే క‌నిపిస్తుంద‌ని ఈ చిత్రం చూసిన వారంద‌రూ అంగీక‌రిస్తారు.

తెర‌వెనుక‌…
1932లోనే ప‌లుకు నేర్చిన తెలుగు సినిమా అంత‌కు ముందు మూకీల‌తో సాగింది. అప్పుడు కానీ, ఆ త‌రువాత కానీ మ‌ల్లీశ్వ‌రిస్థాయిలో సంగీత‌సాహిత్యాలు పోటీప‌డుతూ సాగిన సంద‌ర్భాలు బ‌హు అరుద‌నే చెప్పాలి. అందువ‌ల్ల తెలుగు చిత్ర‌సీమ‌లో తొలి పాట‌ల పందిరిగా మ‌ల్లీశ్వ‌రినే చెప్పుకోవాలి. ఈ చిత్రంలోని అన్ని పాట‌లూ జ‌నాన్ని ఎంత‌గానో అల‌రించాయి. ఇందులో చిన్నాచిత‌కా క‌లిపి మొత్తం 17 పాట‌లున్నాయి. అద్దేప‌ల్లి రామారావు ఆర్కెస్ట్రాకు ఎన్.సి.సేన్ గుప్తా ప్రాసెసింగ్ తోడ‌యింది. ఇక ఎ.కృష్ణ‌న్, పి.వి.కోటేశ్వ‌ర‌రావు చేసిన సౌండ్ మిక్సింగ్ కూడా సినిమాకు ఓ వ‌న్నె తీసుకు వ‌చ్చింది. పురంద‌ర దాసు విర‌చిత‌మైన శ్రీ‌గ‌ణ‌నాథం... పాట‌తో సినిమా ఆరంభం కావ‌డం మ‌రింత శుభ‌సూచ‌కంగా క‌నిపిస్తుంది. మ‌హాన‌టుడు చిత్తూరు వి.నాగ‌య్య వ్యాఖ్యానంతో చిత్రం మొద‌లు కావ‌డం విశేషం. ఇక ఏ.కె.శేఖ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డే సెట్టింగులు సైతం చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తాయి.

పాట‌ల ప‌ర్వం
మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో మొత్తం 15 పాట‌లు కృష్ణ‌శాస్త్రి క‌లం నుండి జాలువారాయి. కోతి బావ‌కు పెళ్ళంట‌... కోయిల తోట విడిదంట‌..., ప‌రుగులు తీయాలి...గిత్త‌లు ఉర‌క‌లు వేయాలి..., పిలిచిన బిగువ‌ట‌రా..., ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు..., నెల‌రాజా వెన్నెల రాజా..., మ‌న‌సున మ‌ల్లెల మాల‌లూగెనే..., ఎందుకే నీకింత తొంద‌ర‌..., అవునా నిజ‌మేనా..., ఉయ్యాలా జంపాలా..., ఓ బావా ...నా బావా..., భ‌ళిరా...రాజా..., ఎవ‌రు ఏమ‌ని విందురో..., తుమ్మెదా తుమ్మెదా..., ఇవి గాక పురంద‌ర‌దాసు విరచిత సంప్ర‌దాయ గీతం, తెలుగునేల‌ను అల‌రించిన నోమీ నోమ‌న్న‌లాలో... అనే జాన‌ప‌ద గీతం కూడా పాట‌ల పందిరిలో చోటు సంపాదించాయి. వెర‌సి అన్ని పాట‌లూ జ‌నం మ‌దిని దోచాయి. ఇందులోని ల‌లిత సంగీతం ఇప్ప‌టికీ సాధ‌కుల‌కు పెద్ద‌బాల‌శిక్ష‌లా ఉప‌యోగ‌క‌రంగా ఉంది. మ‌ల్లీశ్వ‌రి పాట‌ల సాధ‌న‌తోనే భావిగాయ‌నీగాయ‌కులు త‌మ గాన‌క‌ళ‌కు మెరుగులు దిద్దుకోవ‌డం ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంది.

లాభాల బాట‌!
ఆ రోజుల్లో మ‌ల్లీశ్వ‌రి చిత్రంపై ఓ త‌ప్పుడు ప్ర‌చారం బాగా సాగింది. అదేమిటంటే, తొలుత విడుద‌ల‌యిన‌ప్పుడు ఈ చిత్రం అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు అన్న‌దే ఆ ప్ర‌చారం. అప్ప‌ట్లో ఓ సినిమా ఘ‌న‌విజ‌యానికి, ఆ చిత్రం శ‌త‌దినోత్స‌వం ఓ ప్రాతిప‌దిక‌గా ఉండేది. అందుకు కార‌ణం లేకపోలేదు. అప్ప‌ట్లో న‌టీన‌టుల‌కు, సినిమా కోసం ప‌నిచేసిన వారికి తొలుత కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చేవారు. త‌దుప‌రి మొత్తాన్ని సినిమా వంద‌రోజులు అయిన త‌రువాత ఇచ్చేవారు. అందువ‌ల్ల ఓ సినిమా వంద రోజులు ఆడిందంటే స‌ద‌రు చిత్రం విజ‌యం సాధించింద‌నీ, లేదంటే ప‌రాజ‌యం చూసింద‌ని చెప్పుకొనేవారు. 1951 డిసెంబ‌ర్ 20న విడుద‌లైన మ‌ల్లీశ్వ‌రి 1952 ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఏక‌ధాటిగా 13 కేంద్రాల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. అంటే 71 రోజులు ఏక‌ధాటిగా ఆడింద‌న్న మాట‌! ఈ చిత్రాన్ని విడుద‌ల చేసిన విజ‌యా సంస్థ‌వారు ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్ర‌కారం ఇందులోని 11 కేంద్రాల‌లో ఈ చిత్రాన్ని తీసివేసి తాము నిర్మించిన పెళ్ళిచేసిచూడు ను విడుద‌ల చేశారు. అందువ‌ల్ల మ‌ల్లీశ్వ‌రి రెండు కేంద్రాల‌లోనే శ‌త‌దినోత్స‌వం చూసింది. నిజం చెప్పాలంటే అంత‌కు ముందు బిగ్ హిట్ గా నిల‌చిన పాతాళ‌భైర‌వి కంటే ఎక్కువ కేంద్రాల‌లో నేరుగా 70 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మై మ‌ల్లీశ్వ‌రి అప్ప‌ట్లో అహో అనిపించింది. ఈ సినిమా మంచి లాభాల‌ను చూసిందని బి.య‌న్.రెడ్డి ఎవ‌రికీ ఒక్క పైసా కూడా అప్పు పెట్ట‌కుండా అంద‌రి పారితోషికాలు ఇచ్చివేశారు.

విదేశాల‌లో మ‌ల్లీశ్వ‌రి
బి.య‌న్.రెడ్డి అంత‌కు ముందు రూపొందించిన దేవ‌త‌, స్వ‌ర్గ‌సీమ‌ వంటి చిత్రాలు విదేశాల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. కానీ, వాటిని అదేప‌నిగా ఆయ‌నే స్వ‌యంగా తీసుకువెళ్ళి ప్ర‌ద‌ర్శించారు. మ‌ల్లీశ్వ‌రి చిత్రానికి ఆ ప్ర‌యాస త‌ప్పింది. బి.య‌న్. తెర‌కెక్కించిన మ‌ల్లీశ్వ‌రిని చైనా దేశీయులు అభిమానించారు. వారే సొంత‌గా ఈ చిత్రాన్ని త‌మ‌దేశంలో ప్ర‌ద‌ర్శించే హ‌క్కులు కొనుగోలు చేసి, మ‌రీ తీసుకువెళ్ళారు. చైనాలో స‌బ్ టైటిల్స్ తో మ‌ల్లీశ్వ‌రి వంద‌రోజులు చూసింది. విదేశాల‌లో శ‌త‌దినోత్స‌వం చూసిన తొలి తెలుగు చిత్రంగా మ‌ల్లీశ్వ‌రి నిల‌చింది. ఇంత‌టి ఘ‌న‌త ఆ త‌రువాత కూడా ఏ తెలుగు చిత్ర‌మూ సొంతం చేసుకోలేక పోయింది. ఇక ప‌లుమార్లు మ‌న దేశంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లోనూ మ‌ల్లీశ్వ‌రి ప్ర‌ద‌ర్శిత‌మై దేశ‌విదేశీయుల‌ను మురిపించింది. ఇప్ప‌టికీ మేధావి వ‌ర్గాలు తెలుగులో టాప్ 100 మూవీస్ ను ఎంపిక చేసిన ప్ర‌తీసారి మ‌ల్లీశ్వ‌రి, దానితో పాటు పాతాళ‌భైర‌వి చోటు సంపాదించుకుంటూనే ఉన్నాయి. పాతాళ‌భైర‌వి మాస్ ను ఆక‌ట్టుకోగా, మ‌ల్లీశ్వ‌రి పండిత పామ‌ర భేదం లేకుండా అంద‌రినీ అల‌రించింది. మ‌రో విశేష‌మేమంటే, అంత‌కు ముందు తెలుగు చిత్ర‌సీమ‌లో భారీ వ్య‌యంతో నిర్మిత‌మైన చిత్రాలుగా చంద్ర‌లేఖ‌, పాతాళ‌భైర‌వి ఉండేవి. వాటికంటే ఎక్కువ వ్య‌యంతో మ‌ల్లీశ్వ‌రి రూపొందింది. అందువ‌ల్ల కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేద‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తూ ఉంటారు. ఈ సినిమాను ఇంగ్లిష్ లో డ‌బ్ చేయాల‌ని బి.య‌న్.రెడ్డి భావించారు. అయితే చైనాలో మ‌ల్లీశ్వ‌రి ఆద‌ర‌ణ చూశాక‌, ఆయ‌న ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు. ఏది ఏమైనా తెలుగు చిత్ర‌సీమ‌లో పాట‌ల పందిరివేసిన తొలి చిత్రంగా మ‌ల్లీశ్వ‌రి నిల‌చిపోయింది.