NTV Telugu Site icon

Sri Charan Pakala: ‘మేజర్’ తో నా కల తీరింది

Sricharan

Sricharan

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్రానికి సంగీతం అందించి న సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి.

అడవి శేష్ తో ప్రయాణం ఎలా అనిపించింది ?

మా ప్రయాణం చాలా క్రేజీగా సాగింది. ఇద్దరం దాదాపుగా ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం. ‘కిస్’ సినిమాకి కలసి పని చేశాం. ఐతే అది సరిగ్గా ఆడలేదు. క్షణం సినిమాకి మళ్ళీ పిలిచారు. అక్కడి నుండి అసలైన జర్నీ మొదలైయింది. క్షణం, గూడచారి, ఎవరు .. వరుసగా హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మేజర్ చేశాం.

మీరు షార్ట్ ఫిలిమ్స్ కి పని చేస్తూ మెయిన్ స్ట్రీమ్ కంపోజర్ అయ్యారు. ఈ సక్సెస్ ని ముందే ఊహించారా ?

లేదండీ. నేను ఇండస్ట్రీ కి వస్తానని అనుకోలేదు. మా అమ్మగారు చక్కగా పాడతారు. ఆమె ద్వారా గజల్స్ ఎక్కువగా విన్నాను. ఘంటసాల గారి పాటలు, రఫీ, ఓపీ నయ్యర్ ఇలా చాలా మంది మ్యూజిక్ వినేవాడిని. ఇంటర్ తర్వాత చదువుపై ఆసక్తిపోయింది. చదువుతావా లేదా ని ఇంట్లో మందలించారు. అలాంటి సమయంలో సడన్ గా సంగీతం పై ఆసక్తి పెరిగింది. అన్నయ్య గిటార్ ప్లే చేసేవారు. ఆయన కొన్ని గిటార్ కార్డ్స్ నేర్పించారు. తర్వాత నాకు నేనే పాఠాలు నేర్చుకుంటూ రాత్రి పగలు తేడా లేకుండా గిటార్ ప్రాక్టీస్ చేసేవాడని. బ్యాండ్ లో జాయిన్ అయ్యాను. హోటల్స్ లో వాయించా. కాలేజీ ఈవెంట్స్ చేశాం. 2007లోనే మా పాట ఇంటర్ నేషనల్ రేడియో లో వచ్చింది. తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ చేశాం. క్షణం దర్శకుడు రవికాంత్ కి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. రవికాంత్ ‘కిస్’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేసేవారు. ఆ సినిమా కోసం సంగీత దర్శకుడిని వెదుకుతున్న క్రమంలో నన్ను సంప్రదించారు. మొదట ఒక పాట ఇచ్చాను. అది నచ్చి మిగతా పాటలు, బీజీఎం కూడా చేయించారు. అలా జర్నీ మొదలయింది.

‘మేజర్’ చిత్రంలో పాటలుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాలో పాటలకు ప్రాధాన్యత ఉందా?

మేజర్ సందీప్ పర్శనల్ లైఫ్ కూడా ఇందులో చాలా అందంగా చూపించారు. మొత్తం నాలుగు పాటలు వున్నాయి. అన్నీ సందర్భానుసారంగా వస్తాయి. పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చింది.

మహేష్ బాబు గారు సినిమా చూసిన తర్వాత ఇచ్చిన కాంప్లిమెంట్?

ట్రైలర్ లాంచ్ అప్పుడు కలిశాను. ఫెంటాస్టిక్ వర్క్ అని మెచ్చుకున్నారు.

మీరు ఇప్పటి వరకూ చేసిన థ్రిల్లర్స్ కి ‘మేజర్’ కి మీ వర్కింగ్ స్టయిల్ లో ఎలాంటి వ్యత్యాసం వుంది?

మేజర్ లో చాలా లేయర్స్ వున్నాయి. యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్. లవ్ స్టొరీ, ఎమోషన్.. ఇలా చాలా లేయర్స్ వున్నాయి. 90లో ప్రేమకథ వుంది. 90 మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. లవ్ సాంగ్ లో ఆ ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నించా. నేను చేసిన ఫస్ట్ బయోపిక్ ఇది. ఇంతపెద్ద ప్రాజెక్ట్ రావడంతో నా కల నెరవేరినట్లయింది. మేజర్ సందీప్ అద్భుతమైన సినిమా. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా.

‘మేజర్’ లాంటి పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నపుడు ఎలాంటి సవాళ్ళు ఎదురౌతాయి ?

అన్ని భాషలకు సంగీతం సమకూర్చడం కష్టమైన పనే. ఎందుకంటే ఒక భాష నుండి మరో భాషకి వెళ్ళినపుడు లిరిక్స్ మారిపోతాయి. లిరిక్స్ తో పాటు ట్యూన్ కూడా మౌల్ద్ అవుతుంది. ఇది చాలా కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేశాం.

అడవి శేష్ ‘మేజర్’ ఐడియా చెప్పినపుడు మీరు ఎలా ఫీలయ్యారు?

26/11 తాజ్ ఘటన జరిగినప్పుడు నేను చిన్న కుర్రాడిని. మొదటిసారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫోటో చూసినప్పుడు నా మనసులో ఘాడంగా ముద్రపడిపోయింది. సందీప్ ముఖం, నవ్వు వెంటాడుతూనే వున్నాయి. అలాంటిది ఇంతకాలం తర్వాత సందీప్ బయోపిక్ అడవి శేష్ చేస్తున్నాడనేసరికి ఎక్సయిట్ అయ్యాను. అదే సమయంలో భయం కూడా వేసింది. చాలా బాధ్యతతో చేయాల్సిన సినిమా ఇది. ఇప్పటివరకూ నేను చేసిన ‘మేజర్’ వర్క్ కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఇప్పటికీ మేజర్ సాంగ్స్ ట్రెండింగ్ లో వున్నాయి.

ఒక సినిమాకి ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులని పెట్టుకుంటున్న ట్రెండ్ ని మీరు ఎలా చూస్తారు ?

నాకు ఇలా నచ్చదు. చేస్తే పూర్తి సినిమా చేయాలి. స్క్రిప్ట్ విన్న దగ్గర నుండి ఫైనల్ మిక్స్ వరకూ వుండాలి. ఐతే చేయక తప్పదు అనుకునే పరిస్థితిలో మాత్రం చేస్తాను. కానీ పర్శనల్ గా మాత్రం ఈ విధానం నాకు నచ్చదు.

పాటలు, నేపధ్యంలో ఏది ఎక్కువ ఇష్టపడతారు ?

పాటలు చేయడం ఇష్టం, నేపధ్య సంగీతం చేయడంలో ఓ కిక్ వుంటుంది.

సినిమాలు ఎక్కువ చూస్తారా ?

లేదండీ. చాలా తక్కువ సినిమాలు చూస్తాను. ఈ విషయంలో నా స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. అయితే మ్యూజిక్ విషయంలో మాత్రం అప్డేటెడ్ గా ఉంటా. ఎలాంటి ఫిల్మ్ మ్యూజిక్ వస్తుంది? కొత్త సాఫ్ట్ వేర్స్ ఏంటి .. ఇలా అన్ని విషయాలు రోజువారీగా తెలుసుకుంటా. నా సినిమాలని మ్యూజిక్ ని ఎనాలసిస్ చేసుకుంటా. కాంపిటేషన్ ఫీల్డ్ ఇది. ప్రతిరోజు అప్డేట్ అవ్వాల్సిందే.

పాటలో సాహిత్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు ?

పాటకి సాహిత్యం ప్రాణం. సౌండింగ్ చక్కగా కుదిరేలా చూసుకుంటా. పాత, కొత్తవారందరితోనూ కలసి పనిచేయాలని వుంటుంది.

‘మేజర్’ పాటలు ఎవరు పాడారు ?

హృదయం పాట తెలుగులో సిద్ శ్రీరామ్, హిందీలో జావేద్ అలీ, మలయాళంలో ఏరెన్ పాడారు. ఓ ఇషా పాట అర్మాన్ మాలిక్ హిందీ, తెలుగు పాడారు. చిన్మయి హిందీ తెలుగు పాడారు. మలయాళంలో సూరజ్ సంతోష్, యామిని పాడారు

సింగర్ ఛాయిస్ మీకు వుంటుందా ? దర్శకుడికా ?

నాకు వుంటుంది. డైరెక్టర్ ఛాయిస్ ని కూడా గౌరవిస్తా. డైరెక్టర్ విజన్ ఫైనల్ గా వుంటుంది.

దర్శకుడు శశి కిరణ్ తిక్క తో పని చేయడంతో ఎలా అనిపించింది ?

శశి కిరణ్ చాలా కూల్ గా వుంటారు. ప్రతిదాన్ని చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తాడు. గ్రేట్ కన్విక్షన్ వున్న దర్శకుడు. ‘మేజర్’తో దర్శకుడిగా మరో లెవల్ కి వెళ్ళాడని భావిస్తున్నా.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

అల్లరి నరేష్ గారితో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’ దర్శకుడితో మరో సినిమా, ‘గూడాఛారి 2’ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ‘నాంది’ దర్శకుడితో ఓ సినిమా, ‘తెలిసినవాళ్ళు’ టైటిల్ తో ఓ సినిమా, ‘ఎవరు’ కన్నడ వెర్షన్ చేస్తున్నా.

‘మేజర్’ ప్రివ్యూలు టీం చూసే వుంటుంది కదా.. మ్యూజిక్ కి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?

సినిమా చూసి చాలా మంది గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు.

సినిమాలు చేయడం వలన బ్యాండ్స్ ని మిస్ అవుతున్నారా ?

నాకు గిటార్ ప్లే చేయడం ఇష్టం. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ ప్లే చేస్తా. పెళ్ళిళ్ళు కూడా వదలను (నవ్వుతూ)

ఒకే జోనర్ సినిమాలు తప్పితే ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేయలేకపోతున్నాననే వెలితి ఉందా ?

నాకు అన్ని సినిమాలు చేయాలని వుంటుంది. డీజే టిల్లు లో అవకాశం వచ్చింది కాబట్టి పటాస్ పిల్ల లాంటి సాంగ్ చేయగలిగాను. నాకు ఎంటర్ టైనర్లు చేయాలని వుంటుంది. ఇళయరాజా, రెహ్మాన్, మణిశర్మ, కోటి, కీరవాణి గారి ప్రభావం వుంది. అలాగే ఇంటర్నేషనల్ మ్యూజిక్ ని ఎక్స్ ఫ్లోర్ చేశాను. బ్యాండ్ కి వాయించాను. నాకూ ఫుల్ ఎంటర్ టైనర్ కి మ్యూజిక్ ఇవ్వాలనే వుంటుంది. ఐతే ఇప్పటివరకూ థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇకపై అన్ని రకాల సినిమాలు చేయాలనే కోరుకుంటున్నాను.

Show comments