ముంబై ఉగ్రదాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్ 3న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘మేజర్’ అన్ని చోట్లా సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా హిందీ, తెలుగు వెర్షన్ లలో తొలి రెండు స్థానాల్లో నిలిచివారం రోజుల పాటు ట్రెండింగ్ లో నిలవటం విశేషం. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో కూడా టాప్ ప్లేస్ లో నిలిచి అందరినీ ఆకట్టుకుంది.
ఈ సక్సెస్ ను పురస్కరించుకుని ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ యూనిట్ సభ్యులకు, సన్నిహితులకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జ, శ్రీచరణ్ పాకాల, నిర్మాత నాగవంశీ, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, అభిజీత్ వంటి చిత్ర ప్రముఖులు ఈ పార్టీలో సందడి చేశారు. వరుసగా ‘గూఢచారి’, ‘మేజర్’ సక్సెస్ తో హిట్ డైరక్టర్స్ జాబితాలో చేరిన శశికిరణ్ మరి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నారు.
