మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ సినిమా థియేటర్లు మరికొన్ని రోజులు బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న సినీ ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ ఇచ్చింది. మహారాష్ట్రతోపాటు కేరళలో కూడా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీనంతటికి కారణం కోవిడ్ -19. ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులతో మాట్లాడిన తరువాత కోవిడ్ నియంత్రణకు రాష్ట్రంలో అనుసరించాల్సిన సవరించిన మార్గదర్శకాలను ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం 50% ఆక్యుపెన్సీతో రెస్టారెంట్లు, తినుబండారాలు, షాప్స్, మాల్స్, జిమ్, పార్లర్, సెలూన్ రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ప్రైవేట్ కార్యాలయాలు 24 గంటలూ పనిచేస్తాయి. ఉద్యోగులకు పూర్తిగా టీకాలు వేయించాలి.
100 మంది (ఇండోర్), 200 (అవుట్‌డోర్)తో వివాహాలు జరుపుకోవచ్చు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, మతపరమైన ప్రదేశాలు మూసి వేయాలి. రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు అనుమతించబడవు. ఈ సవరించిన మార్గదర్శకాలన్నీ 15 ఆగస్టు 2021 నుండి అమలులోకి వస్తాయి.
Read Also : “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్”కు రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్
మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ పై దెబ్బ పడనుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్‌లో మహారాష్ట్ర ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరుస సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు ఇది షాకిచ్చే విషయం.
