Site icon NTV Telugu

Sushanth : వినోదాన్ని నింపుకున్న ‘మా నీళ్ళ ట్యాంక్’!

Maa Neella Tank

Maa Neella Tank

 

ఇప్పుడు టాలీవుడ్ లోని యువ కథానాయకులందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది. వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలకు వాళ్ళు పచ్చజెండా ఊపేస్తున్నారు. సినిమాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండటం కంటే కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సీరిస్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలా తాజాగా ఓటీటీ బాట పట్టిన హీరో సుశాంత్. జీ 5 సంస్థ నిర్మిస్తున్న ‘మా నీళ్ళ ట్యాంక్’లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిగా సుశాంత్ నటించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత ఈ వెబ్ సీరిస్ తో తెలుగు లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది ప్రియా ఆనంద్. ‘వరుడు కావలెను’ మూవీతో దర్శకురాలిగా పరిచయం అయిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకుంది.

వచ్చే నెల 15 నుండి ఈ వెబ్ సీరిస్ జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. బుచ్చివోలు అనే గ్రామంలోని నీళ్ళ ట్యాంక్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆ ఊరి ఎమ్మెల్యే కోదండం కొడుకు గోపాల్ నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. తాను ప్రేమించిన సురేఖను తిరిగి తీసుకొస్తే కానీ తాను ఆ ట్యాంక్ పై నుండి దిగనని బెదిరిస్తాడు. దాంతో సురేఖను తీసుకొస్తే… అతను కోరుకుంటున్నట్టు ఊరి నుండి ట్రాన్సఫర్ చేస్తానని సబ్ ఇన్ స్పెక్టర్ గిరికి హామీ ఇస్తాడు కోదండం. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కోదండం వ్యతిరేకులు ఎత్తులు మీద పై ఎత్తులు వేసి అతని పరువును మంట కలిపే పని చేస్తుంటారు. మరి సురేఖ తిరిగి ఊరు వచ్చిందా? గోపాల్ ఆమెను పెళ్ళి చేసుకున్నాడా? ట్రాన్స్ ఫర్ కోసం తపిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ గిరి ఎమ్మెల్యే కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనేదే ఈ వెబ్ సీరిస్ కథ. ఆద్యంతం వినోదభరితంగా ఇది ఉంటుందని, కథకు తగ్గట్టుగానే దీనికి ‘మా నీళ్ళ ట్యాంక్’ అనే పేరు పెట్టామని లక్ష్మీ సౌజన్య చెబుతున్నారు. సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, రామరాజు, దేవి, అన్నపూర్ణమ్మ, అప్పాజీ అంబరీశ్‌, బిందు చంద్రమౌళి, సందీప్ వారణాసి, లావణ్య రెడ్డి ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.

Exit mobile version