Maa Inti Bangaram: సమంతకు మరో బిగ్ సక్సెస్.. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి!

Maainti Bangaram

Maainti Bangaram

Maa Inti Bangaram: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సమంత కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19 న థియేటర్లలో అడుగుపెట్టింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా మంచి స్పందన రావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది. కుటుంబ అనుబంధాలు, కామెడీ, యాక్షన్ థీమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ మూవీ. ఇక ఈ విజయానికి మరో ముఖ్య కారణం మౌత్ పబ్లిసిటీ. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉండటంతో రోజురోజుకూ ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కూడా ‘మా ఇంటి బంగారం’కు అనుకూలంగా మారింది. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తడిమల్ల, శ్రీముఖి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, సమంత స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించడం. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆమె తీసుకున్న ఈ అడుగు విజయవంతం కావడం విశేషం. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ఇటీవల కాలంలో కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎంత పెద్ద విజయాన్ని అందిస్తున్నారో ‘మా ఇంటి బంగారం’ మరోసారి నిరూపించింది. సమంత నటన, నందిని రెడ్డి దర్శకత్వం, బలమైన కథ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కలిసి ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

×
×
Ad