Peddada Murthy: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ గీత రచయిత పెద్దాడ మూర్తి మంగళవారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. భీముని పట్నంలో జన్మించిన పెద్దాడ మూర్తికి తండ్రి పెద్దాడ వీరభద్రరావు నుండి సాహితీ వాసనలు అబ్బాయి. కాళీపట్నం రామారావు వంటి ప్రముఖుల రచనలతో స్ఫూర్తి పొందిన పెద్దాడ మూర్తి విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ‘ఆంధ్రభూమి’ దిన పత్రిక భీమిలీ రిపోర్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ సినీ గీత రచయిత వేటూరి వారి స్ఫూర్తితో హైదరాబాద్ వచ్చారు. శివరంజని, సూపర్ హిట్, జ్యోతిచిత్ర సినీ వార పత్రికలో పలు సంవత్సరాలు పాత్రికేయునిగా పనిచేశారు. అప్పుడు సినిమా దర్శకులతో ఏర్పడిన పరిచయాలతో గీత రచయితగా మారారు. తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘కూతురు’ సినిమాకు తొలి గీతాన్ని రాశారు.
కృష్ణవంశీ ‘చందమామ’ చిత్రానికి రాసిన పాటకూ పెద్దాడ మూర్తికి మంచి గుర్తింపు లభించింది. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రానికి పెద్దాడ మూర్తి పాట రాశారు. పలు టీవీ సీరియల్స్ కూ ఆయన రాసిన పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భరత్ మూవీ ‘నాగలి’కి పెద్దాడ మూర్తి మాటలు, పాటలు అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాడ మూర్తి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని, బుధవారం హైదరాబాద్ రాజీవ్ నగర్ లో శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దాడ మూర్తి సోదరుడు పివిడిఎస్ ప్రకాశ్ కూడా పాత్రికేయుడు, రచయిత. ఆయన గత యేడాది కన్నుమూశారు.
Tollywood: చిత్రసీమలో విషాదం… గీత రచయిత కన్నుమూత!!

Peddada (1)