తెలుగువారికి సుపరిచితులు పరుచూరి సోదరులు. మాటల గారడీతో మహా విజయాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఘనులు పరుచూరి బ్రదర్స్. వారిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. జూన్ 21న ఆయన పుట్టినరోజు. ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు
సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో సాగిన విధానాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలోనే కాదు యావద్భారతంలోనూ ఇద్దరు రచయితలు కలసి నలభై ఏళ్లుగా ప్రయాణం సాగించటం అరుదైన విషయం అనే చెప్పాలి. నలభై ఏళ్ళకు పైగా పరుచూరి వెంకటేశ్వరరావు, ఆయన తమ్ముడు గోపాలకృష్ణ కలసి ‘పరుచూరి బ్రదర్స్’గా తమదైన రచనతో జనాన్ని రంజింప చేస్తూనే ఉన్నారు. తొలి నుంచీ వెంకటేశ్వరరావు రాయడంలో ఆరితేరినవారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాస్తూ సాగారు వెంకటేశ్వరరావు. తరువాత ఏజీ ఆఫీసులో పని చేస్తూ సినిమా రంగంలో అడుగు పెట్టారు. అగ్నికి ఆజ్యంలా ఆపై తమ్ముడు గోపాలకృష్ణ కూడా తోడయ్యారు. ఇద్దరినీ కలిపి అన్న నందమూరి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి పరిచయం చేశారు. ‘అనురాగదేవత’ సినిమాలో తొలిసారి ‘పరుచూరి బ్రదర్స్’ టైటిల్ తో జనం ముందు నిలిచారు పరుచూరి సోదరులు.
‘అనురాగదేవత’ రచన చేసే సమయంలో ఏ ముహూర్తాన యన్టీఆర్ ఈ అన్నదమ్ములకు పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారో కానీ అప్పటి నుంచీ మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అప్రతిహతంగా దూసుకుపోయారు ఈ సోదరులు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ సూపర్ హిట్స్ అందించారు. కొందరు హీరోలను వీరి సినిమాలే స్టార్స్ గానూ నిలిపాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మాటల తూటాలు పేల్చడంలో, భాషా పరోటాలు పంచడంలో అన్నదమ్ములిద్దరూ చేయితిరిగిన వారు. అన్నవెంకటేశ్వరరావు సెంటిమెంట్ పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఎమోషన్ కురిపించేవారు. ఇలా ఇద్దరూ తమ కథల్లో పాత్రలకు ప్రాణం పోస్తూ సాగారు. వారి కలం నుండి
జాలువారిన సంభాషణలు తెలుగునేల నలుదిక్కులా మారుమోగుతూనే ఉన్నాయి. పరుచూరి సోదరులు రచనతో పాటు నటనలో అడుగుపెట్టారు. ఆ పై దర్శకత్వమూ చేసి అలరించారు. వెంకటేశ్వరరావు నటునిగా పలు చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. సహాయ నటుడుగా నంది అవార్డును కూడా గెలుపొందారు. ఎందరో యువ దర్శకులకు గురువులుగా సాగిన పరుచూరి సోదరుల వద్ద శిష్యరికం చేసిన వారెందరో నేడు చిత్రసీమలో అగ్రగాములుగా రాణిస్తున్నారు. జూన్ 21తో 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.