NTV Telugu Site icon

Stunt Master: లెజండరీ ఫైట్ కొరియోగ్రాఫర్ ఇక లేరు!

Judo

Judo

Judo Rathnam: చిత్రసీమను వరుస విషాద సంఘటనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీనియర్ స్టంట్ కొరియోగ్రాఫర్, లెజండరీ ఫైట్ మాస్టర్ జూడో కె.కె. రత్నం (93) గురువారం తన స్వగ్రామంలో కన్నుమూశారు. 1970-80 మధ్య కాలంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీయార్, కృష్ణ, కృష్ణంరాజు, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్, రజనీకాంత్, చిరంజీవి, విజయ్, అజిత్ వంటి అనేకమంది హీరోల చిత్రాలకు ఆయన స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. వివిధ భాషల్లో దాదాపు 1200 చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన అనుభవం జూడో రత్నంది. రజనీకాంత్ కైతే ఏకంగా 46 చిత్రాలకు ఆయన పనిచేశారు. తన కెరీర్ లో 63 మంది హీరోలకు పోరాట దృశ్యాలను సమకూర్చినందుకు గానూ జూడో రత్నం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను చోటు దక్కించుకున్నారు. ఆయన ఫైట్స్ కంపోజ్ చేసిన చివరి చిత్రం ‘పాండ్యన్’ 1992లో విడుదలైంది.

విశేషం ఏమంటే… ఫైట్స్ కు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా ఆయన ‘తామరైకులం, కొంజుం కుమరి-2, పోకిరి రాజా, తలైనగరం’ వంటి సినిమాలలో నటించారు. చిత్రసీమకు ఆయన అందించిన సేవలకు గానూ తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డును ప్రదానం చేసింది. వయోభారం కారణంగా అనారోగ్యంతో ఉన్న ఆయన గురువారం తన సొంతవూరైన వేలూరు జిల్లాలో గుడియాత్తంలో కన్నుమూశారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతున్నాయి. జూడో రత్నం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ విషాద వార్త నుండి పూర్తిగా కోలుకోక ముందే హైదరాబాద్ లో ప్రముఖ నటి జమున మరణవార్త, చెన్నయ్ లో డబ్బింగ్ కళాకారులు శ్రీనివాసమూర్తి హఠాన్మరణం చిత్రసీమలోని వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి.