Site icon NTV Telugu

Will Smith: విల్ స్మిత్ కు సిగ్గేసింది!

Will Smith

Will Smith

Will Smith: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు వినగానే గత యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై ఆయన చేయి చేసుకున్న సంగతి గుర్తుకు రాకమానదు. అదే వేదికపై ‘కింగ్ రిచర్డ్’ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నిలిచారు విల్ స్మిత్. అయితే క్రిస్ రాకపై విల్ ప్రవర్తన కారణంగా పదేళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల కమిటీ ఆయనను బహిష్కరించింది. ఇదీ అందరికీ తెలిసిన విషయమే! కాగా ‘ఆస్కార్’ స్థాయిలో నల్లజాతీయులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఎన్ఏఏసీపీ’ ఇమేజ్ అవార్డును ఈ సారి విల్ స్మిత్ దక్కించుకున్నారు. ఆస్కార్ తరువాత విల్ ఎంపికైన ప్రతిష్ఠాత్మక అవార్డు ఇదే కావడం గమనార్హం! ‘ఎన్ఏఏసీఏ’ అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల జరిగింది. ఈ సారి హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ‘ఎమాన్సిపేషన్’ సినిమాతో విల్ స్మిత్ ‘ఎన్ఏఏసీపీ’ అవార్డుల్లో ఉత్తమ నటునిగా నిలిచారు. అయితే ఆ అవార్డును అందుకోవడానికి విల్ స్మిత్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి విల్ దృష్టిలో ఈ ‘ఎన్ఏఏసీపీ’ ఇమేజ్ అవార్డులంటే విల్ స్మిత్ కు చిన్నచూపు ఉందా!? అదేమీ కాదు నల్లజాతీయులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డులుగా వీటికి చరిత్ర ఉంది.

‘వర్ణవివక్ష’కు పేరుగాంచిన అమెరికాలో మొదటి నుంచీ తెల్లవారిదే పైచేయిగా సాగుతోంది. అయితే అక్కడి ఆఫ్రికన్ అమెరికన్స్ నల్లజాతి కలువలుగా తమదైన బాణీ పలికిస్తూనే సాగుతున్నారు. ఎవ్వరికీ తాము తలొగ్గేదే లేదంటున్నారు బ్లాక్ పీపుల్. ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్’అనే సంస్థను 1909లోనే నెలకొల్పి వివిధ రంగాల్లో రాణించిన నల్లజాతీయులను గౌరవిస్తూ ఉంటారు. వీటిలో 1969 నుండి కళలను కూడా చేర్చారు. అందులో భాగంగానే సినీమాలకూ అవార్డులు లభిస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే అమెరికాలోని నల్లజాతీయులు ఈ అవార్డులనే ఆస్కార్ కన్నా మిన్నగా భావిస్తూ ఉంటారు. న్యూయార్క్ వేదికగా సాగే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్ పాల్గొనక పోవడానికి ఓ కారణముంది? అదేమిటంటే, విల్ చెంపదెబ్బ కొట్టిన క్రిస్ రాక్ సైతం నల్లజాతీయుడే! ఆ కారణంగా విల్ కు సొంతవారి నుండే వ్యతిరేకత ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కానీ, ఆ వివాదాన్ని మరచి ‘ఎన్ఏఏసీపీ’ సంస్థ ఈ సారి ఇమేజ్ అవార్డ్స్ లో విల్ స్మిత్ నే ఉత్తమ నటునిగా ఎంపిక చేసింది. మరి, విల్ స్మిత్ ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొనక పోవడానికి కారణం- సిగ్గట! పైకి కారణాలు ఏవో చెబుతున్నా, ఆస్కార్ అవార్డుల వేదికపై తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి, ఈ అవార్డుల ప్రదానోత్సవంలోనూ విల్ పాల్గొనలేదట!

Exit mobile version