Hanu Raghavapudi:ఎన్ని సినిమాలు హిట్ అయినా ఒక్క సినిమా ప్లాపు పడితే మాత్రం ఆ డైరెక్టర్ కు అంతకు ముందు ఉన్న పేరు మొత్తం పోయినట్టే. ఆ ప్లాపును పట్టుకొని అవకాశాలు ఇవ్వడం కాదు కదా.. కనీసం మరొక కథను వినడానికి కుయిదా ధైర్యం చేయరు. అది ప్రతి చిత్ర పరిశ్రమలో ప్రతి డైరెక్టర్ ఎదుర్కొంటున్న సమస్యే. ఇక ఈ సమస్య తోనే బాధపడ్డాడట సీతారామం దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి లాంటి అందమైన ప్రేమ కావ్యంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హనును రికమెండ్ చేసింది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్తూ ఉంటారు. వారాహి బ్యానర్లో అందాల రాక్షసిని నిర్మించింది రాజమౌళినే అని అందరికి తెల్సిందే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హను తన ప్రేమ కథలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక ఈ నేపథ్యంలోనే అతని దర్శకత్వంలో పడి పడి లేచే మనసు చిత్రం తెరకెక్కి అపజయాన్ని మూట గట్టుకొంది. ఈ సినిమాతోనే హనుకు సెకండ్ హాఫ్ చెడగొడతాడు అనే ముద్ర పడిపోయింది. ఈ సినిమా తరువాత అతని కథలు అన్నా, అతని దర్శకత్వం అన్నా భయపడే స్టేజికి వచ్చారట హీరోలు, నిర్మాతలు.
ఇక సీతారామం కథను ముందుగా స్వప్న దత్ కు వినిపించినప్పుడు హనును నమ్మకండి అంటూ కొన్ని దుష్ట శక్తులు తమను అడ్డుకున్నాయని నిర్మాతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే వారు ఎవరు..? ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇండస్ట్రీలో హనుకు ఉన్న శత్రువులు ఎవరై ఉంటారని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అలా చెప్పింది ఒక భజన బ్యాచ్ అని, ఒక బడా నిర్మాత కింద పనిచేస్తున్నవారే ఇదంతా చేశారని మాట్లాడుకుంటున్నారు. ట్యాలెంట్ ను తొక్కేయడంలో ముందు వరుసలో ఉండే వారే ఇదంతా చేసారని అంటున్నారు. ఈ బ్యాచ్ వలన ఎంతోమంది తమ ట్యాలెంట్ ను బయటికి చూపించలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే వారి మాటలను నమ్మకుండా స్వప్న ఈ కథను, హనును నమ్మి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆమె గొప్పతనమని మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ట్యాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా తన ప్రతిభతో ప్రశంసలను అందుకోగలడని మరోసారి హను రాఘవపూడి నిరూపించాడు.