Swathi Mutyam: బెల్లంకొండ వారి చిన్నబ్బాయి గణేష్ స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుండడంతో బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా కొద్దిగా రిస్క్ చేసి స్టార్ హీరోలతో పోటీ పడడానికి సిద్ధమైంది. చిరంజీవి, నాగార్జున పోటీ పడుతున్న దసరా రోజునే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా గురించిన ఆసక్తి విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. ట్రైలర్, టీజర్ ను బట్టి ఈ సినిమాలో హీరోకు ఒక సమస్య ఉంటుంది. దానివలన అతడు పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటాడు. అమ్మాయిలతో మాట్లాడడానికి జంకుతూ ఉంటాడు.
తాజాగా ఆ సమస్య.. ఏక్ మినీ కథ చిత్రంలో హీరోకు ఉన్న సమస్యలాంటిదే అని అంటున్నారు. అంటే ఈ సినిమాలో ఈ హీరో అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటాడని టాక్ వినిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల్లో కుర్రాడికి పెళ్లి చేసే సమయంలో అతడు ఒక పర్సనల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతుండడం, ఆ విషయం తెలిసీ పెళ్లి నుంచి తప్పించుకోవాలని తెఇరగడం చివరికి హీరోయిన్ తో పెళ్లి అయ్యాక ప్రేమ కన్నా ఏది గొప్ప కాదు అని నిరూపించడం చాలా సినిమాల్లో చూసే ఉన్నామా. ఏక్ మినీ కథ కూడా అటుఇటుగా ఇలాంటి కథే. కానీ స్వాతి ముత్యం లో కథ వేరుగా ఉంటుందని, ఆ సమస్యతో బాధపడుతున్న అమాయకపు పెళ్లి కొడుకు ఎలా తన సమస్య నుంచి బయటపడ్డాడు అనేది వినోదాత్మకంగా చూపించారట. మరి మొదటి సినిమానే ఇలాంటి కథను తీసుకోవడంతో గణేష్ గట్స్ తెలుస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.