తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి, అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి, అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే విజయశాంతికి ‘సరిలేరు ఎవ్వరూ’ అని జనం జేజేలు పలికారు. ఆ మధ్య విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలచిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి విజయశాంతి రీ ఎంట్రీ కార్డ్ ఎంతగానో పనిచేసిందని పరిశీలకులు చెబుతున్నారు. మళ్ళీ విజయశాంతి వెండితెరపై నటిస్తే చూడాలని జనం ఆశిస్తున్నారు. ఆమెకు హిట్ పెయిర్స్ గా నిలచిన బాలకృష్ణ, చిరంజీవి ఇంకా నటిస్తూనే ఉన్నారు. కాబట్టి, వారిద్దరూ నటించే ఏదో ఒక చిత్రంలో విజయశాంతి కూడా నటిస్తే బాగుంటుందనీ ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
విజయశాంతి 1966 జూన్ 24న మద్రాసులో జన్మించారు. ఆమె తండ్రి సట్టి శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందినవారు, తల్లి వరలక్ష్మి తెలంగాణ ఏటూరు నాగారంకు చెందినవారు. ప్రముఖ నర్తకి, నటి విజయలలితకు స్వయానా అక్క కూతురు విజయశాంతి. విజయశాంతి చిత్రప్రయాణం భలేగా సాగింది. ఆరంభంలోనే కృష్ణ సరసన నాయికగా ‘కిలాడీ కృష్ణుడు’లో నటించిన విజయశాంతికి, ఆ తరువాత చెల్లెలు పాత్రలే పలకరించాయి. యన్టీఆర్, ఏయన్నార్ అన్నదమ్ములుగా నటించిన ‘సత్యం-శివం’లో వారిద్దరికీ చెల్లిగా నటించాక పలువురి దృష్టిని ఆకర్షించింది. ‘పెళ్ళిచూపులు’లో చంద్రమోహన్ జోడీగా నటించిన తరువాత నాయికగానూ మురిపిస్తుందనే నమ్మకం సినీజనానికి కలిగింది. టి.కృష్ణ రూపొందించిన ‘నేటి భారతం’ విజయశాంతికి నటిగా మంచిమార్కులు సంపాదించి పెట్టింది. అదే టి.కృష్ణ తెరకెక్కించిన ‘ప్రతిఘటన’తో విజయశాంతి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. అటుపై చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ విజయనాయికగా నిలిచారు. నాగార్జున, వెంకటేశ్ తోనూ విజయాలు చూసిన విజయశాంతి, రాజశేఖర్, సుమన్, వినోద్ కుమార్ వంటి వారికి కూడా హిట్ పెయిర్ గా నిలవడం విశేషం.
ఫైటింగ్స్ లోనూ భళా అనిపిస్తూ సాగిన విజయశాంతి, ‘కర్తవ్యం’లో పోలీస్ ఆఫీసర్ గా నటించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. ఆ తరువాత నుంచీ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్ లో విజయశాంతి తనదైన బాణీ పలికిస్తూ సాగారు. ఒకానొక దశలో ఆ నాటి టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకు దీటుగా విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సాగాయి. ‘లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్’ వంటి టైటిల్స్ తో ఆమెను అభిమానులు ఆదరించారు. విజయశాంతి పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆమె ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా లేచారు. దాసరి రూపొందించిన ‘ఒసేయ్ రాములమ్మ’లో విజయశాంతి అభినయం అందరినీ ఆకట్టుకోవడమే కాదు, మరోమారు ఆల్ టైమ్ హిట్ ను సొంతం చేసుకున్నారు. విజయశాంతి అదే పనిగా విజయాలను సొంతం చేసుకోలేదు. విజయాలే ఆమె అభినయాన్ని ముద్దాడుతూ వచ్చాయి.
‘ఒసేయ్ రాములమ్మ’ తరువాత మళ్ళీ విజయశాంతికి ఆ స్థాయి విజయం లభించలేదు. అయినా, ఆమె నటించిన అనేక సినిమాలు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాయి. ముఖ్యంగా తెలుగునేలపై పలువురు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నెలకొని, పోరాట పటిమ పెరగడానికి విజయశాంతి చిత్రాలే దోహదం చేశాయని చెప్పవచ్చు. ‘కర్తవ్యం’ చూశాక కొంతమంది అమ్మాయిలు పోలీస్ రంగంపై ఆసక్తిని పెంచుకొని, ఆ శాఖలో పోలీసులుగా రాణిస్తున్నారు. తన చిత్రాలతో ఎంతగానో అలరించిన విజయశాంతి రాజకీయాల్లోనూ కాలు మోపారు. తొలుత బీజేపీ పార్టీలో ఉన్నారు. తరువాత టీఆర్ఎస్ లో చేరి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. ఆపై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మళ్ళీ బీజేపీలోనే అడుగు పెట్టారు. తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న విజయశాంతి ఈ ప్రాంతంలోనే ఎంపీగా విజయం చూశారు. ఇప్పుడు కూడా తెలంగాణలోనే తన గళం వినిపిస్తున్నారు. మళ్ళీ విజయశాంతి క్రియాశీల రాజకీయాల్లో పాలు పంచుకుంటారా? అన్నదీ కొందరి మదిలో మెదలుతున్న అంశమే! మరోవైపు మళ్ళీ విజయశాంతిని వెండితెరపై చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఒకప్పటి ఈ లేడీ సూపర్ స్టార్ రాబోయే రోజుల్లో రాజకీయాలతో హీటెక్కిస్తారో, లేక తెరపై మరోమారు వెలిగిపోతారో చూడాలి.