తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వెంటనే స్పందించడమే కాదు.. అప్పుడప్పుడు తానే ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో ముచ్చటిస్తారు. వారి సమస్యల్ని తెలుసుకొని, అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఆయన ట్విటర్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ఓ ప్రశ్న సంధించారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని, తద్వారా హైదరాబాద్‌ను భారతీయ చిత్ర రంగానికి కేంద్రబిందువుగా మార్చవచ్చని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. ఆ అంశంపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని, సంక్షోభం వల్ల తమ ప్రణాళికలు ఆలస్యం అయ్యాయని వివరణ ఇచ్చారు.
అయితే.. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత కొండా సురేఖ పలు అంశాలపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తే, ఏ ఒక్కదానికీ కేటీఆర్ బదులివ్వలేదు. తొలుత ఆమె తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను ఎందుకు బ్లాక్ చేశారని సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత యాదాద్రి నిర్మాణంలో లోపం ఎవరిదని ప్రశ్నించిన ఆమె.. ఇన్నేళ్ళ నుంచి మర్చిపోయిన వరంగల్ టెక్స్‌టైల్ పార్కుపై ఇప్పుడెందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందని నిలదీశారు. మరెన్నో అంశాలపై ప్రశ్నించారు కానీ, కేటీఆర్ మాత్రం పట్టించుకోలేదు.
