NTV Telugu Site icon

Krithi Shetty Birthday : ఉరకలేస్తోన్న ‘ఉప్పెన’ నాయిక కృతి శెట్టి!

Krithi Shetty Birthday

Krithi Shetty Birthday

ఉప్పెనలో సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి ఉస్సూరుమంటూ కూలుతూ కనిపిస్తాయి. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి కెరీర్ కూడా ఆ చిత్ర ఘనవిజయంతో ఒక్కసారిగా ఉద్ధృతంగా ఎగసింది. తెలుగు చిత్రసీమలోని ప్రముఖ హీరోలతో వరుసగా నటించే అవకాశాలు చేజిక్కించుకుంటూ సాగుతోంది కృతి శెట్టి. తొలి సినిమా తరువాత ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాల ఫలితాలు ఉస్సూరుమనిపిస్తున్నాయి. అదలా ఉంచి, కృతి శెట్టిని తమ చిత్రాలలో నాయికగా నటింప చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

కృతి శెట్టి 2003 సెప్టెంబర్ 21న ముంబైలో జన్మించింది. కన్నడ సీమ నుండి ముంబైలో స్థిరపడిన కుటుంబం వారిది. మాతృభాష తులు. అయితే హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ కృతి శెట్టికి మంచి పట్టుంది. చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది కృతి. సైకాలజీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే కృతి కొన్ని యాడ్ మూవీస్ లో నటించింది. హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ‘సూపర్ 30’ సినిమాలో ఓ చిన్న పాత్రలో తెరపై తొలిసారి తళుక్కుమంది కృతి. అదే సమయంలో ‘ఉప్పెన’ దర్శకుడు తన చిత్రంలో నాయిక కోసం అన్వేషిస్తున్నారు. తన హీరోయిన్ కు కావలసిన అన్ని లక్షణాలు కృతిలో కనిపించడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’లో ఆమెను నాయికగా ఎంచుకున్నారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’లోని వైవిధ్యమైన కథ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ సినిమా సాధించిన విజయంతో కృతికి తెలుగునాట అవకాశాలు మొదలయ్యాయి. తెలుగు భాషలోనూ మాట్లాడేందుకు కృషి చేస్తోంది కృతి.

‘ఉప్పెన’ కాగానే నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ’లో ఓ నాయికగా నటించింది కృతి. తరువాత ‘బంగార్రాజు’లో నాగచైతన్య సరసన చిందేసి కనువిందు చేసింది. రామ్ హీరోగా రూపొందిన ‘ద వారియర్’ ద్విభాషా చిత్రంలోనూ కృతి హీరోయిన్ గా నటించింది. నితిన్ సరసన ‘మాచెర్ల నియోజకవర్గం’లో కనిపించింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లో డాక్టర్ అలేఖ్య, అఖిలగా ద్విపాత్రాభినయం చేసింది కృతి. ఇలా తక్కువ సమయంలోనే నాలుగు చిత్రాలలో నాయికగా నటించేసింది. కానీ, తొలి సినిమా స్థాయి సక్సెస్ మళ్ళీ ఆమె దరికి చేరలేదు. ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తోంది కృతి. అందులో ఒకటి బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘వనంగాన్’ కాగా, మరోటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం. నాగచైతన్య, కృతి శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆమె పుట్టినరోజునే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోవడం విశేషం! రాబోయే సినిమాలతోనైనా మరో బిగ్ హిట్ ను కృతి తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Show comments