తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీల కన్నా ఎక్కువ హిట్స్, ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసిన ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమనే. అంతెందుకు ప్రస్తుతం అన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల కన్నా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే. సలార్, OG, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర, టైగర్ నాగేశ్వర రావు లాంటి సినిమాలు నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న గోల్డెన్ ఫేజ్ లో ఒకప్పుడు తమిళ సినిమా ఉండేది. శంకర్, మణిరత్నం, వెట్రిమారన్ లాంటి దర్శకులు తమిళ సినిమాని బౌండరీలు దాటించారు. వెట్రిమారన్ లాంటి దర్శకుడు చేసింది అయిదారు సినిమాలే అయినా నాలుగు నేషనల్ అవార్డ్స్ ని తీసుకున్నాడు. సడన్ గా శంకర్ డౌన్ అవ్వడం, మణిరత్నం మునపటిలా సినిమాలు చేయలేకపోవడం, వెట్రిమారన్ విడుదలై కోసం కొంచెం గ్యాప్ తీసుకోవడంతో కోలీవుడ్ నుంచి సరైన సినిమాలు రావట్లేదు. అసురన్ లాంటి సినిమాలో ఎంత మెసేజ్ ఉంటుందో అంతే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఆ బాలన్స్ ఉన్నప్పుడే అన్ని వర్గాలకి ఆ సినిమా నచ్చుతుంది.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అంతా కంటెంట్ ని వదిలి కమర్షియల్ బాట పట్టడమే కోలీవుడ్ దెబ్బ తినడానికి కూడా కారణం అయ్యింది. కమర్షియల్ సినిమాకి సోషల్ మెసేజ్ అద్దడంలో కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దిట్ట, ఇప్పుడు ఇదే కరువయ్యింది. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు లేక హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు బాలన్స్ చేస్తూ సాగే సినిమాని మాత్రం కోలీవుడ్ పూర్తిగా మర్చిపోయింది. మళ్లీ అలాంటి సినిమాలు వస్తేనే కోలీవుడ్ కి పూర్వవైభవం వస్తుంది. నిజానికి కోలీవుడ్ లో కోవిడ్ ఎరాలో కూడా ఎక్కడో ఎప్పుడో జై భీమ్, సార్పట్ట పరంబర్తె లాంటి సినిమాలు వస్తున్నా కూడా అది ఓటీటీలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ విషయం అర్ధం చేసుకోకుండా తెలుగు సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమకి మొండి చెయ్యి చూపించారు, మా సినిమాలకి అన్యాయం చేసారు అంటూ కొందరు మేధావులు తెలుగు హీరోలపైన, తెలుగు సినిమాపైన పడి ఏడుస్తుండడం విచారం.
