బాలీవుడ్ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో మొదలైపోయింది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన కరణ్ ఇటీవలే 7 వ సీజన్ లోకి అడుగుపెట్టాడు. జూలై 7 న మొదటి ఎపిసోడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ అలియా భట్ లతో స్టార్ చేసి రచ్చ చేశాడు. ఇక తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లు హంగామా చేశారు. సారా, జాన్వీ మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఇక ఈ ప్రోమోలో వీరిద్దరి పరిచయం దగ్గర నుంచి ఎన్నో విషయాలను కరణ్ బయటికి లాగాడు.
ఇక ఎప్పటిలాగానే కరణ్.. ఈ ముద్దుగుమ్మలను ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సారా.. విజయ్ దేవరకొండ అని టక్కున చెప్పేసింది. దీంతో కరణ్, జాన్వీ వైపు చూడడం, ఆమె తాను కూడా విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తానని చెప్పడంతో ఇద్దరు ముద్దుగుమ్మలు ఫక్కున నవ్వుకోవడం ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న విషయం విదితమే. ఈమె కూడా ఒకప్పుడు విజయ్ తో నటించాలని చెప్పిందే.. మరి డేటింగ్ పక్కన పెడితే విజయ్ సరసన ఈ ముద్దుగుమ్మలు ముందు ముందు నటిస్తారేమో చూడాలి.