Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం

Kiran Abbavaram

Kiran Abbavaram

Kiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోగా ఇండస్ట్రీలో, జనాల్లో మంచి గుర్తింపు వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదని కిరణ్ తెలిపారు. “నాకు హీరో అనే ఇమేజ్‌తో జీవించడం కంటే సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తిలా ఉండటమే ఇష్టం. ఆ ఇమేజ్ నన్ను ప్రభావితం చేయకూడదు” అని అన్నారు. సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా తాను స్నేహితుల దగ్గరకు వెళ్లిపోతానని, అక్కడ తనను ఓ సాధారణ వ్యక్తిగానే చూస్తారని చెప్పారు. అదే తనను ఎప్పుడూ నేలపై ఉండేలా చేస్తుందని తెలిపారు.

ఇక యూత్‌కు కిరణ్ ఓ ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. 23 నుంచి 28 ఏళ్ల మధ్యలో కనీసం ఒక సంవత్సరం తమతో తాము గడపాలని యూత్‌కు సూచించారు. ఇతరుల ప్రభావం లేకుండా తన గురించి తాను తెలుసుకునే సమయం దొరికితే జీవితంలో ఏం కావాలో సరైన స్పష్టత వస్తుందని ఆయన సూచించారు. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తనకు తొలి షార్ట్ ఫిలిం అవకాశం అనుకోకుండా వచ్చిందని గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను గమనించి షార్ట్ ఫిలింలో హీరోగా నటిస్తావా అని అడిగారని అన్నారు. ఆ సమయంలో తాను హీరో అవుతానని కూడా ఊహించలేదని, కానీ ఆ అవకాశం తన జీవితాన్ని మార్చిందని కిరణ్ చెప్పారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.