Kiara Reached Dubai With Siddharth To Celebrate Her Birthday
అందం, అభినయం కలబోసుకున్న రూపం కియారా అద్వానీ సొంతం. ఆమెను చూడగానే ‘జూనియర్ హేమామాలిని’ అంటూ కీర్తించిన వారున్నారు. అలాగే ఈ తరం వారికి కియారాను ‘డ్రీమ్ గర్ల్’గానూ అభివర్ణించారు. మన తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’లోనూ, రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’లోనూ నటించిన కియారా అంటే కుర్రకారు కిర్రెక్కిపోతారు. జూలై 31న కియారా అద్వానీ 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అందులో విశేషమేముంది అంటారా? ఆమె తన బర్త్ డేను దుబాయ్ లో జరుపుకుందట! కియారా అద్వానీని, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర బుట్టలో పడేశాడని ముంబయ్ లో విశేషంగా వినిపిస్తోంది. ఈ ప్రేమపక్షులు ఎవరి కంటా పడకుండానే రొమాన్స్ సాగిస్తున్నారనీ సమాచారం. వీరిద్దరూ కలసి ‘షేర్ షా’ చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ బాలీవుడ్ లో ‘లవ్ బర్డ్స్’గానే కియారా, సిద్ధార్థ్ పేరు సంపాదించారు.
కియారా బర్త్ డేకు తన సోషల్ మీడియా అకౌంట్ లో “హ్యాపీ బర్త్ డే కి..” అంటూ సిద్ధార్థ్ సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, దుబాయ్ లో తన బర్త్ డే కు సిద్ధార్థ్ ను ప్రత్యేకంగా కియారా ఆహ్వానించిందనీ తెలుస్తోంది. ఆమె, సిద్ధార్థ్ తో పాటు కియారా సోదరుడు కూడా కలసి దుబాయ్ లో షాపింగ్ చేశారనీ సమాచారం. ఆ పిక్స్ కూడా ఇప్పుడు నెట్టింట చిందేస్తున్నాయి. కియారా, సిద్ధార్థ్ ప్రేమించుకుంటే మంచిదేగా! వారిద్దరూ ఎక్కడ తిరిగితే మనకెందుకు అంటారా? మామూలు ప్రేమకథలు వింటేనే జనం పులకించి పోతుంటారు. మరి సెలబ్రిటీస్ … అందునా అందమైన కియారా, అందగాడనిపించుకున్న సిద్ధార్థ్ ప్రేమాయణం! బాలీవుడ్ జనం ఊరకే ఉంటారా? మరి కియారా, సిద్ధార్థ్ తమ ప్రణయగాథను పరిణయం దాకా ఎప్పుడు తీసుకు వెళతారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
