Site icon NTV Telugu

Collections: ‘బాహుబలి-2’వసూళ్ళను ‘కేజీఎఫ్-2’ దాటలేదు!?

Bahubali2

Bahubali2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ సినిమాల కన్నా మిన్నగా వసూళ్ళు చూసిందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘కేజీఎఫ్-2’ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వారాంతం చూసింది. అందువల్ల మొదటి రోజునే భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.53.95 కోట్లు పోగేసింది. కానీ, 2017 ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి-2’, ఈ యేడాది మార్చి 25న జనం ముందు నిలచిన ‘ట్రిపుల్ ఆర్’ రెండూ శుక్రవారం రోజున విడుదల కావడం గమనార్హం!

ఐదేళ్ళ క్రితం విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రం మొదటి రోజున రూ. 41 కోట్లు రాబట్టింది. ఈ యేడాదే జనం ముందుకు వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ ఫస్ట్ డే రూ. 20.07 కోట్లు మాత్రమే చూసింది. ఇక ‘కేజీఎఫ్-2’ రెండవ రోజు శుక్రవారం రూ. 46.79 కోట్లు కొల్లగొట్టింది. అలా చూసినా ‘కేజీఎఫ్-2’ ఆ రెండు చిత్రాల కంటే ఎక్కువగా ఉన్నట్టే లెక్క. అయితే ఐదు సంవత్సరాల క్రితం రేట్లకు, ఇప్పుడు రేట్లకు తేడా ఉన్న మాట వాస్తవం. దాదాపు 50 శాతం రేట్లు పెరిగినట్లు అంచనా. ఇక ఆ రోజుల్లోనే ‘బాహుబలి-2’ మొదటి రోజు 41 కోట్లు పోగేసిన విషయాన్ని మర్చిపోరాదు.

సరే ఆ లెక్కలు ఎలా ఉన్నా, పది రోజులకు ‘కేజీఎఫ్-2’ రూ. 298.44 కోట్లు రాబట్టింది. ‘బాహుబలి-2’ పది రోజులకు రూ. 327.75 కోట్లు కొల్లగొట్టింది. అదీ ఐదేళ్ళ క్రితం. ఇక ‘ట్రిపుల్ ఆర్’ పది రోజులకు రూ. 184.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ టోటల్ రన్ లో రూ.510.99 కోట్లు మూటకట్టింది. ‘కేజీఎఫ్-2’ రాబోయే వారాంతానికి రూ.350 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. ఆ తరువాత ఎంత పోగేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ పది రోజుల కలెక్షన్ కంటే ‘కేజీఎఫ్-2’ పదిరోజుల వసూళ్ళు రూ. 113.69 కోట్లు అధికం అన్న మాట వాస్తవం! అయితే అదే టైమ్ లో ‘కెజిఎఫ్2’ పది రోజుల వసూళ్ళ కంటే ‘బాహుబలి2’ పదిరోజులకు 29.31 కోట్లు అధికంగా వసూలు చేయటం విశేషం. అదీ నాలుగేళ్ళ క్రితం. ఈ లెక్కన ‘బాహుబలి2’ పూర్తి స్థాయి వసూళ్ళను చేరుకోవడం ‘కెజిఎఫ్2’కి కష్టమే. మరి టోటల్ రన్ లో ‘కేజీఎఫ్-2’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Exit mobile version