కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ దీనిని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. దీనిని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ధృవలోని బహుముఖీన ప్రజ్ఞను కొనియాడారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ధృవ మరింత ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచెరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే తెలియచేస్తామని నిర్మాతలు దీప్తి, పృథ్వీ అన్నారు.