Kerala Woman Director Booked For Adult Movie: సినీ పరిశ్రమలో మహిళా బాధితులే కాదు.. పురుష బాధితులు కూడా ఉన్నారని తాజా ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. తాను అడల్ట్ సినిమాలో నటించను ముర్రో అని ఓ నటుడు ఎంత మొత్తుకున్నా.. మహిళా దర్శకురాలు మాత్రం వదల్లేదు. తాము చెప్పినట్టు బూతు సినిమాలో నటించాల్సిందేనంటూ.. ఆ నటుడిపై ఒత్తిడి తెచ్చింది. లేకపోతే రూ. 5 లక్షలు కట్టమని బెదిరించింది. దీంతో.. అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేరళలో చోటు చేసుకున్న ఈ అనూహ్య ఘటన వివరాల్లోకి వెళ్తే..
అతడు ఒక బుల్లితెర నటుడు. సినిమాల్లో రాణించాలనేదే అతని కల. ఎట్టకేలకు అతనికి ఒక సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. తమ వద్ద ఒక సినిమా ఆఫర్ ఉందని, మంచి పారితోషికం ఇస్తామని ఓ మహిళా దర్శకురాలు అతడ్ని సంప్రదించింది. అయితే.. ముందుగా అగ్రిమెంట్‌లో సంతకం చేయాలని చెప్పింది. తనకు ఆఫర్ వచ్చిందన్న ఆనందంలో.. ఆ అగ్రిమెంట్‌లో ఏముందో చదవకుండానే ఆ నటుడు సంతకం చేశాడు. కట్ చేస్తే.. షూటింగ్‌లో పాల్గొనేందుకు అతడు సెట్స్‌కి వెళ్లాడు. అప్పుడు అతనికి అసలు విషయం తెలిసింది. తాను చేస్తోంది సాధారణ సినిమా కాదు, ఒక అడల్ట్ సినిమా అని! దీంతో.. అతడు అడల్ట్ సినిమా అయితే చేయనని, తాను వెళ్లిపోతానని అన్నాడు. కానీ.. ఆ మహిళా దర్శకురాలు మాత్రం వదల్లేదు. అగ్రిమెంట్‌పై సంతకం చేశావు కాబట్టి, తాము చెప్పినట్లుగానే బూతు సినిమాలో నటించాల్సిందేనని, లేకపోతే.. రూ. 5 లక్షలు కట్టమని చెప్పింది.
దాంతో చేసేదేమీ లేక, అతడు షూట్‌లో పాల్గొన్నాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి, గోడు వెళ్లబోసుకున్నాడు. దీని గురించి ఆ నటుడు మాట్లాడుతూ.. ‘‘నేను అగ్రిమెంట్ చదవకుండా సంతకం చేశాను. వాళ్లు నన్ను ఓ షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్లారు. ఓ గదిలోకి తీసుకెళ్లి.. ఇది అడల్ట్ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్తే.. అగ్రిమెంట్‌పై సంతకం చేశావ్ కాబట్టి చేయాల్సిందేనన్నారు. లేకపోతే రూ. 5 లక్షలు కట్టమని బెదిరించారు. అది మారుమూల ప్రాంతం కావడంతో తప్పించుకోలేకపోయాను’’ అని రోధించాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.