Site icon NTV Telugu

 Sony Liv: క్రిష్ డైరెక్షన్ లో ‘కన్యాశుల్కం’!

Krish

Krish

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ మధ్య తానా బహుమతి పొందిన ‘కొండపొలం’ నవలను అదే పేరుతో క్రిష్ సినిమాగా రూపొందించారు. ఈ మధ్య కాలంలో సినిమాలే కాకుండా డిజిటల్ మీడియా మీద కూడా క్రిష్‌ దృష్టి పెట్టారు. తాజాగా ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘9 గంటలు’ నవలను అదే పేరుతో వెబ్ సీరిస్ గా తీశారు. తొమ్మిది ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ కు క్రిష్‌ షో రన్నర్ గా వ్యవహరించారు.

విశేషం ఏమంటే… తాజాగా క్రిష్ వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన గురజాడ అప్పారావు  నాటకం  ‘కన్యాశుల్కం’ను వెబ్ సీరిస్ గా మలచబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ వెబ్ సీరిస్ లో నటించబోతున్నారు. సోనీ లివ్ కోసం క్రిష్‌ ఈ నవలను వెబ్ సీరిస్ గా తీస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే… 1955లోనే ‘కన్యాశుల్కం’ నాటకంను దర్శకులు పి. పుల్లయ్య ఎన్టీయార్, సావిత్రి, సీఎస్ఆర్, గోవిందరాజులు సుబ్బారావు, షావుకారు జానకి, విన్నకోట రామన్న పంతులు, గుమ్మడి, వంగర తదతరులు ప్రధాన తారాగణంగా తెరకెక్కించారు. తొలి తెలుగు ఆధునిక నాటకాలలో ఒక్కటైన ‘కన్యాశుల్కం’ను ఈ తరం మెచ్చేలా క్రిష్ ఎలా రూపొందిస్తారో చూడాలి!

Exit mobile version