ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఈ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ లేరనే విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు పునీత్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఈ ఏడాది ఆరంభంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ ఆరంభించాడు. సాహసోపేతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను పునీత్ తల్లి పార్వతమ్మరాజ్‌కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు.
పునీత్ భార్య, చిత్ర నిర్మాత అశ్విని పునీత్ ఈ టీజర్ ను విడుదల చేస్తూ ‘అప్పు కల ఇది. అద్భుతమైన ప్రయాణం. ఇది తిరిగి వచ్చే టైమ్- ‘గంధద గుడి’ అని ట్వీట్ చేశారు. కర్నాటకలోని దట్టమైన అడవుల్లో పునీత్ ప్రయాణాన్ని ఈ టీజర్ ఆవిష్కరిస్తోంది. రాష్ట్రంలో వన్యప్రాణుల అవలోకనం కూడా కనిపిస్తుంది. విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఇందులో పునీత్‌ను చూసిన అభిమానులు, ప్రేక్షకులు భావోద్వేగానికి గురవటం ఖాయం. ‘వైల్డ్ కర్ణాటక’ అనే డాక్యుమెంటరీ తీసిన అమోఘవర్ష ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ‘గంధద గుడి’ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
