Kamal Haasan’s ex-wife Sarika: కమల్ హాసన్ మాజీ భార్య, ఓ నాటి అందాల తార, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక మళ్ళీ తెరపై అలరించనున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఊంచాయి’ చిత్రంలో సారిక ఓ ప్రధాన భూమిక పోషించారు. ఈ చిత్రం నవంబర్ 11న జనం ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఊంచాయి’లో మాలా త్రివేది అనే పాత్రలో సారిక కనిపించబోతున్నారు. సారిక పేరు వినగానే ఉత్తరాది వారికి ఒకప్పుడు అందంతో చిందులు వేసిన ఆమె ముగ్ధమనోహర రూపమే ముందుగా గుర్తుకు వస్తుంది. దక్షిణాది వారికి మాత్రం సారికా హాసన్ గా ఆమె సాగిన వైనమూ స్ఫురిస్తుంది.
సారిక ఠాకూర్ 1962 జూన్ 3న న్యూ ఢిల్లీలో జన్మించారు. మరాఠీ తల్లి, రాజ్ పుత్ తండ్రికి జన్మించిన సారిక, బాల్యంలోనే జీవనం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఆమె తండ్రి కుటుంబాన్ని వదలి వెళ్ళిపోవడంతో సారికనే చిన్నతనంలో సంసారభారం నెత్తిన వేసుకుంది. దాంతో ఆమె ఏ నాడూ పాఠశాలకు వెళ్ళి చదవలేదు. ఐదేళ్ళ ప్రాయంలోనే 1967లో మీనాకుమారి, ధర్మేంద్ర జంటగా రూపొందిన ‘మజ్లీ దీదీ’లో బాలనటిగా నటించింది సారిక. దాదాపు పాతిక పైగా చిత్రాలలో బాలనటిగా నటించిన సారిక ‘గీత్ గాతా చల్’ సినిమాతో నాయికగా పరిచయం అయ్యారు. పలు చిత్రాలలో నాయికగా అందంతో ఆకట్టుకున్నారు సారిక. కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘టిక్ టిక్ టిక్’లో సారిక మిస్ ఇండియా పాత్రలో కనిపించారు. ఇదే కమల్ తో ఆమె తొలి చిత్రం. కమల్ హిందీ చిత్రసీమలో అడుగు పెట్టిన తరువాత వారిద్దరూ కలసి ‘రాజ్ తిలక్’లో నటించారు. ఆ సినిమా సమయంలో వారి మధ్య స్నేహం పెరిగింది. తరువాత అది అనుబంధంగా మారింది, ప్రేమబంధంతో ముందుకు సాగారు. ‘కరిష్మా’ అనే చిత్రంలోనూ వారు నటించారు. అయితే ఈ మూడు చిత్రాలలో ఒక్క ‘రాజ్ తిలక్’లోనే సారిక ముఖ్యపాత్ర పోషించారు. మిగిలిన రెండు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. కమల్ మొదటి భార్య వాణీగణపతితో విడాకులు మంజూరు కాకముందు నుంచే ఆయనతో సారిక సహజీవనం సాగించారు. తత్ఫలితంగా 1986లో శ్రుతిహాసన్ కు జన్మనిచ్చారు. ఆ పై 1988లో కమల్, సారిక పెళ్ళాడారు. 1991లో అక్షర హాసన్ పుట్టింది.
Read Also: Priya Bhavani Shankar: సత్యదేవ్ మూవీతో కోలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ!
కమల్ హాసన్ చిత్రాలకు సారికా హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. కమల్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ డిజైనర్, అసోసియేట్ డైరెక్టర్ గానూ వ్యవహరించారామె. కమల్ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించిన ‘హే రామ్’ చిత్రం ద్వారా సారికకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డు కూడా లభించింది. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు. 2006లో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు సారిక. ‘సేక్రెడ్ ఈవిల్: ఏ ట్రూ స్టోరీ’ హిందీ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారామె. 2007లో ‘పర్జానియా’ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు సారిక. అటుపై తన దరికి చేరిన వాటిలో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ సాగుతున్నారు సారిక. కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటించిన ‘బార్ బార్ దేఖో’ చిత్రంలో హీరో తల్లిగా నటించిన సారిక దాదాపు ఆరేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘ఊంచాయి’లో నటించారు. ఆరు పదుల వయసులోనూ నాటి అభిమానులను ఆకర్షిస్తూ సాగుతున్న సారిక నటించిన ‘ఊంచాయి’ని చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. నవంబర్ 11న జనం ముందుకు వస్తోన్న ఈ చిత్రంలో సారిక అభినయం ఏ తీరున అలరిస్తుందో చూడాలి.