మలయాళీ బ్యూటీ అయినప్పటికి కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ, తాజాగా విడుదలైన ‘కొత్త లోక’లో సూపర్ ఉమెన్ పాత్రతో అలరించింది. ఇంతవరకు ప్రధానంగా సరదా పాత్రలు చేసిన ఆమె, ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ సీన్లలో కనిపించడం ప్రత్యేకం. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో కల్యాణి తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఆమె మాటల్లో.. “మా స్వస్థలం కేరళ అయినప్పటికీ నేను చెన్నై లో పుట్టి పెరిగాను. అమ్మానాన్న ఇండస్ట్రీలో ఉండటంతో చిన్నప్పటి నుంచే షూటింగ్ సెట్స్ వాతావరణం నాకు పరిచయం. అక్కడి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. 2017లో ‘హలో’ ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టాను. అప్పటి వరకు ఎక్కువగా లైట్ హార్ట్‌డ్ రోల్స్ మాత్రమే చేసాను. కానీ ‘కొత్త లోక’ కోసం నేను ఆరు నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఇది నాకు కొత్త అనుభవం” అని చెప్పింది. అలాగే తన స్నేహితుడు దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో నాకు దుల్కర్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా, లేదా ఏదైనా సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్‌కే చేస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారు” అని చెప్పి తన బంధాన్ని బయటపెట్టింది. కల్యాణి ప్రస్తుతం మలయాళం, తెలుగు సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, విభిన్న పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది.