Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మదర్‌హుడ్ తర్వాత తన కెరీర్, స్టోరీల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీల్ పుట్టిన తర్వాత సినిమాలు సైన్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది ఇండియా స్టోరీ’, మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘రామాయణ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కాజల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలను సైన్ చేసే విధానం గురించి, స్టోరీలను ఎంపిక చేసే విధానం గురించి పలు విశేషాలను పంచుకున్నారు.
స్టోరీల ఎంపికపై కాజల్ మాట్లాడుతూ.. “ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ ఓకే చేసినా నా కొడుకు నీల్ దృష్టి నుంచే ఆలోచిస్తాను. వాడు పెద్దయ్యాక ‘మమ్మా చేసిన గ్రేట్ సినిమా ఇది’ అని గర్వంగా చెప్పుకునేలా నా లైనప్ ఉండాలనుకుంటున్నా. అందుకే స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను” అని చెప్పారు. చేతన్ డీకే దర్శకత్వంలో శ్రేయస్ తల్పడేతో కలిసి ఆమె నటించిన ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో కాజల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి చెప్తూ.. “కల్తీ ఆహారం, పురుగుమందుల వాడకం వల్ల ప్రజల ప్రాణాలు ఎలా బలి అవుతున్నాయనే కథ నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్ విన్నాక.. నా కిచెన్‌లో ఏ వస్తువులు ఉంచాలి, నీల్‌కు ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదో అప్పటికప్పుడే నిర్ణయించుకుని మార్పులు చేసేశాను” అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
ఇక నితేష్ తివారీ దర్శకత్వంలో యశ్, రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కాజల్ ‘మండోదరి’ పాత్ర పోషిస్తున్నారు. “నీల్‌కు రామాయణం అంటే చాలా ఇష్టం. ఇంట్లో రోజూ రామలీలా చూస్తాడు. నేను ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే వాడు ఎగ్జైట్ అయ్యాడు. విచిత్రమేంటంటే వాడికి రావణుడి పాత్రే ఇష్టం (నవ్వుతూ). రామాయణ పార్ట్ 2 వచ్చేసరికి వాడికి ఐదేళ్లు వస్తాయి. నీల్ థియేటర్‌లో చూసే మొదటి సినిమా ఇదే అవుతుంది” అని కాజల్ వెల్లడించారు.

