తెలుగు చిత్రసీమలో స్క్రీన్ ప్లే రాయడంలో దిట్ట అనిపించుకున్నవారు బహుకొద్దిమందే! వారిలో నటదర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు స్థానం ప్రత్యేకమైనది. మొదటి నుంచీ ఆయన పాశ్చాత్య చిత్రాలను అధ్యయనం చేసి, వాటిలోని స్క్రీన్ ప్లే అంశాలను తాను తెరకెక్కించే చిత్రాలకు అనువుగా మలచుకొనేవారు. తన దర్శకత్వంలో రూపొందిన ‘దీక్ష’ (1951) నాటి నుంచీ ఆయన అదే పంథాలో సాగారు. స్ట్రెయిట్ గా సాగే కథను ‘నాన్-లీనియర్’లో ఏదో ఒక్క సన్నివేశంలోనైనా ఫ్లాష్ బ్యాక్ పెట్టి చూపించే ప్రయత్నం చేసేవారు ప్రకాశరావు. ప్రేక్షకుడిలో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తించేందుకు ఈ విధానం బాగా పనిచేస్తుందని ప్రకాశరావు విశ్వసించేవారు. తాను తెరకెక్కించిన సాంఘిక చిత్రాలలోనే కాదు, పౌరాణిక గాథల్లోనూ ఈ పద్ధతినే అనుసరించేవారాయన.
కె.యస్. ప్రకాశరావు పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం ‘ప్రేమనగర్’. ఇందులో కథానాయకుడు కళ్యాణ్ కు కన్నతల్లి అంటేనే పెద్దగా అభిమానం ఉండదు. కథ ఆరంభం నుంచీ ప్రేక్షకుడిలో అతనెందుకు తల్లితో అలా ఉన్నాడు అనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కన్నతల్లి కంటే తనను పెంచిన తల్లి ఎంతో ప్రేమగా చూసుకొనేదని హీరో ఓ సారి తన గతాన్ని చెప్పడం ద్వారా చూసేవారికి అసలు విషయం బోధ పడేలా చేశారు. ఇక యన్టీఆర్ తో కె.యస్. ప్రకాశరావు తెరకెక్కించిన ‘విచిత్ర కుటుంబం’లో కీలకమైన సన్నివేశాన్ని స్క్రీన్ ప్లేలోనే చూపించారు. కన్నకొడుకులా తన మరిదిని చూసుకొనే వదిన కోర్టులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి, మరిది జైలుకు వెళ్ళేలా చేస్తుంది. అలా ఎందుకు చేసింది అన్నది చూసేవారికి ఆసక్తి కలిగిస్తుంది. విలన్ తన మరిదిని చంపకుండా ఉండడానికి, నెల రోజుల పాటు అతను జైలులో ఉంటే అక్కడ సురక్షితంగా ఉంటాడని ఆ వదిన భావించి ఉంటుంది. అందుకు కారణం, విలన్ తన మనిషితో గతంలో ఓ హత్య చేయించి ఉంటాడు. దానిని ఈ వదిన కళ్ళారా చూసి ఉంటుంది. అందువల్లే తన మరిదికి అలా కాకూడదనే ఆమె కోర్టులో అబద్ధం చెప్పి, మరిదికి శిక్ష పడేలా చేసి ఉంటుంది. లీనియర్ ఫార్మాట్ లో సాగినా, జనానికి అర్థమయ్యేలా ఉన్న ఈ కథలను కె.యస్.ప్రకాశరావు తనదైన పంథాలో నాన్ లీనియర్ గా రూపొందించి ఆకట్టుకున్నారు.
ప్రకాశరావు స్క్రీన్ ప్లేస్ అన్నిటిలోకి బెస్ట్ ఏది అంటే ఆయన రూపొందించిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ అని చాలామంది చెబుతారు. అందులో కథను ఫ్లాష్ బ్యాక్స్ లో చెప్పిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ రోజుల్లో అందరూ అలాగే సాగుతున్నారు. 1971లోనే కె.యస్. ప్రకాశరావు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ని ఆ తీరున తెరకెక్కించి ఆకట్టుకున్నారు. శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శోభన్ కు స్టార్ డమ్ తెచ్చిన తొలి చిత్రంగా నిలచింది. ఇవే కాదు ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన “నా తమ్ముడు, ఇదా లోకం, చీకటివెలుగులు” చిత్రాల్లోనూ ఆయన తనదైన బాణీ పలికించారు. ఇలా స్క్రీన్ ప్లేతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు కె.యస్.ప్రకాశరావు. పాటల్లో కూడా ఆయన తనదైన శైలిని చూపించారు. దానినే ఆయన తనయుడు కె.రాఘవేంద్రరావు పట్టేసి, తన చిత్రాలలో పాటలను తెరకెక్కించడంలో భళా అనిపించుకున్నారని చెప్పవచ్చు.