ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎలా అలజడి సృష్టించాయో అందరూ చూశారు. ఆర్ఆర్ఆర్ అయితే కొన్ని ‘ద బ్యాట్మాన్’ సినిమానే వెనక్కు నెట్టేసింది.
అలాంటి మన టాలీవుడ్‌పై భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమాలు స్వల్ప కాలిక వినోదం మాత్రమే అందిస్తున్నాయి. తెలుగు సినిమాలు చూస్తూ తెలుగులో సబ్ టైటిల్స్ చదివి డైలాగ్స్ అర్ధం చేసుకునే దయనీయ స్థితికి తెలుగు సినిమాని నెట్టొద్దు’’ అని ఆయనన్నారు. లెజెండరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు రాసిన “నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ” అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పంపించిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ మాటలు ఎక్కువగా ఉన్నాయని, అవి సగటు తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిల్ ఉండడం లేదని జస్టిస్ ఎన్‌వీ రమణ ఉద్దేశం. హాలీవుడ్ సినిమాలకి పోటీ ఇవ్వాలన్న మోజులో, తెలుగుని మర్చిపోవద్దని ఆయన మన మేకర్స్‌ని సూచిస్తున్నారు. నిజమే.. ఆర్ఆర్ఆర్‌లో విదేశీ నటులకు ఇంగ్లీష్ డైలాగులే ఉండడం పట్ల, చాలామంది ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగులో వాటిని డబ్ చేసి ఉంటే బాగుండేదని రిక్వెస్టులు చేశారు. తెలుగు వరకూ డైలాగుల్ని అనువదించి ఉంటే, బాగుండేది.
