దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి వాయిదా లేకుండా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం మినహా మిగిలిన అన్ని వెర్షన్లకు హీరోలు ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి చిత్ర కథానాయిక అలియా భట్ మాట్లాడుతూ “మీరు ఖచ్చితంగా ట్రైలర్‌ని విని ఉంటే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ హిందీలో వారి స్వంత స్వరాలతో డబ్ చేసారు. ప్రేక్షకులు ఈ వాళ్ళ వాయిస్ తో అద్భుతమైన అనుభూతిని పొందుతారు” అంటూ చెప్పుకొచ్చింది.
‘ది కపిల్ శర్మ షో’లో హిందీ డబ్బింగ్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్… పెద్దగా కష్టపడకుండా హిందీలో ఎలా మాట్లాడగలిగాడో తెలిపాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ “హైదరాబాద్ ఎక్కువగా హిందీ మాట్లాడే నగరాల్లో ఒకటి. అలాగే పాఠశాలలో నా మొదటి భాష హిందీ. ఎందుకంటే నేను ఈ భాష నేర్చుకోవాలని మా అమ్మ కోరుకుంది. ఇది మా జాతీయ భాష కాబట్టి… అదే ఇప్పుడు నాకు సహాయపడింది. ఇక ముంబై నుండి కొంతమంది స్నేహితులు, సాంకేతిక నిపుణులు వస్తూనే ఉన్నారు. కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటే నెమ్మది, నెమ్మదిగా భాషను నేర్చుకోవడం ఈజీ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పాల్గొన్న కపిల్ శర్మ షో స్పెషల్ ఎపిసోడ్ జనవరి 2న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో విడుదల కానుంది.
