నందమూరి నట వారసుడిగా, ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తాత పేరును నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింప చేస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి వారసుడిగా ఎప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ పెద్దలలోనూ ఆసక్తిరేపుతున్న విషయం. అప్పుడు వస్తాడు .. ఇప్పుడు వస్తాడు.. ఎన్టీఆర్ అన్న రావాలి.. టీడీపీకి ఉత్తేజం తేవాలి అంటూ అభిమానులు గోల చేయడం తప్పించి ఎన్టీఆర్ ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడింది లేదు.. రాజకీయాలలోకి వస్తాను అని చెప్పింది లేదు. ఇక తాజాగా ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేశాడు తారక్. ఇటీవల ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టివ్ పాలిటిక్స్ గురించి మొట్టమొదటిసారి నోరువిప్పాడు.
“నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఉంది.నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను.” అని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి అభిమానులకు తాను పాలిటిక్స్ లోకి రాను క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా అందాయి.
