Janhvi Kapoor : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను కూడా అందుకోవచ్చని గత కొన్నేళ్లుగా ట్రాక్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త తరహా కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో వస్తున్న హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో కనిపించిన జాన్వీ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జాన్వీ కపూర్ ఒక హై కాన్సెప్ట్ క్రీచర్ హారర్ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా, భారీ స్థాయిలో రూపొందించే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉండబోతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ నిలవడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తి కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. కల్ట్ క్లాసిక్ హారర్ ఫాంటసీ చిత్రంగా గుర్తింపు పొందిన ‘తుంబాడ్’ దర్శకుడు రాహి అనిల్ బర్వే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘తుంబాడ్’ విడుదలైన తర్వాత ఇండియన్ హారర్ సినిమాలకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. విజువల్ ట్రీట్, భయానక వాతావరణం, ఫాంటసీ అంశాల కలయికతో రూపొందిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇప్పుడు అదే దర్శకుడు మరో భారీ హారర్ ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతుండటం సినీ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.
ఈ ప్రాజెక్ట్‌పై జాన్వీ కపూర్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం నటించడం మాత్రమే కాకుండా, పాత్ర కోసం పూర్తిస్థాయి సన్నాహాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లలో పాల్గొనాలని భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. క్రీచర్ హారర్ జానర్ అంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే జాన్వీ ముందుగానే పాత్రలోకి పరకాయప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో జాన్వీ కపూర్ తన పాత్రల ఎంపికలో కూడా వైవిధ్యం చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘పెద్ది’లో గ్లామర్ రోల్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు హారర్ జానర్ లో భయేట్టేందుకు సిద్ధమవుతోంది. రాహి అనిల్ బర్వే వంటి దర్శకుడితో కలిసి హారర్ జానర్‌లో అడుగుపెట్టడం ఆమె కెరీర్‌లో మరో ఆసక్తికరమైన మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే, భారతీయ హారర్ సినిమాల అభిమానులకు మరో భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

