Janhvi Kapoor : జాన్వీ కపూర్ ప్రేమ కథ గురించి ఈమధ్య కాలంలో బాగానే చర్చ నడిచింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఆ ఊహాగానాలను నిజం చేస్తున్నాయి. కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరోయిన్ నిజంగానే త్వరలో రాజకీయ కుటుంబానికి కోడలిగా మారబోతుందా? ఇద్దరి ప్రేమకు కుటుంబ సభ్యుల ఆమోదం ఇప్పటికే లభించిందా? ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో వెనుక అసలు కథ ఏంటో తెలుసుకుందాం. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న జంటల్లో జాన్వీ కపూర్, శిఖర్ పహారియా ఒకరు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా, తమ సంబంధాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, ఒకరిపై ఒకరు చూపించే అభిమానంతో వీరి బంధం గురించి అభిమానులకు పెద్దగా సందేహం లేదు. ఇప్పుడు మరోసారి జాన్వీ చేసిన ఒక చిన్న చర్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలో జాన్వీ కపూర్ నైట్ సూట్ వేసుకుని కనిపించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె టీ షర్ట్‌పై రాసిన సందేశం. “నేను దారి తప్పిపోతే, దయచేసి నన్ను శిఖర్ పహారియా దగ్గరకు తీసుకెళ్లండి” అనే క్యాప్షన్ ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క లైన్‌తోనే జాన్వీ తన ప్రేమను మరోసారి అందరి ముందూ వ్యక్తం చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటో వైరల్ అయిన వెంటనే అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. “ప్రేమను ఎంత దాచాలనుకున్నా దాగదు”, “ఇద్దరి పెళ్లి ఎప్పుడు?” అంటూ నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా జాన్వీ శిఖర్ పేరు ఉన్న లాకెట్ ధరించి కనిపించడం, పలు వేడుకల్లో అతడితో కలిసి హాజరుకావడం, విదేశీ పర్యటనల్లో ఇద్దరూ కనిపించడం వంటి సంఘటనలతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్ళేలా ఉందని అనుకుంటున్నారు నెటిజన్లు.
కేవలం జాన్వీ మాత్రమే కాదు, కపూర్ కుటుంబ కార్యక్రమాల్లో కూడా శిఖర్ పహారియా తరచూ కనిపిస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులతో అతడు ఎంతో సన్నిహితంగా మెలగడం చూసిన అభిమానులు ఈ సంబంధానికి ఇరు కుటుంబాల ఆమోదం కూడా లభించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా, వీరిద్దరి అనుబంధం రోజురోజుకీ మరింత బలపడుతోందనే భావన అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక శిఖర్ పహారియా నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, వ్యాపార రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సినీ పరిశ్రమకు, పొలిటికల్ కుటుంబానికి ఏర్పడిన ఈ లవ్ ట్రాక్ కు పెళ్లి బాజాలు ఎప్పుడు మొదలవుతాయో మరి.
అయితే ఇప్పటివరకు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా తమ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో, ఇద్దరి మధ్య కనిపిస్తున్న అనుబంధం, కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన అభిమానులు మాత్రం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట మాత్రం జాన్వీ కపూర్, శిఖర్ పహారియానే అని చెప్పడంలో సందేహం లేదు.

