Site icon NTV Telugu

James Cameron: జేమ్స్ కేమరాన్ భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా??

James Cameron Avatar2

James Cameron Avatar2

James Cameron On Avatar The Way Of Water: జేమ్స్ కేమరాన్ తన 2009 నాటి ‘అవతార్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘అవతార్ – ద వే ఆఫ్ వాటర్’ను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా సక్సెస్ కాకపోతే, తరువాత సీక్వెల్స్ ఉండవు అని జేమ్స్ కేమరాన్ బాంబు పేల్చాడు. అదలా ఉంటే ఈ సినిమా నిడివి చాలా పొడవని, ప్రదర్శన సమయం కూడా మూడు గంటల పది నిమిషాలు ఉంటుందని చిత్రనిర్మాతల్లో ఒకరైన జోన్ లండావ్ తెలిపారు. ఈ సినిమాను ఇంగ్లిష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ ట్రైలర్ ను రిలీజ్ చేసిన లండావ్ ఈ సినిమా జనానికి భలేగా నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతకేమో సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. దర్శకుడేమో ఈ సినిమా ఫ్లాప్ అయితే, తరువాత సీక్వెల్స్ ఉండవని అంటున్నారు. మరి ఏది నిజం?

‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ 190 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందినా, జనం విసుగు చెందకుండా చూస్తారని జేమ్స్ అంటున్నారు. ఎందుకంటే ప్యాండమిక్ లో వెబ్ సిరీస్ చూస్తూ గంటల కొద్దీ ఎంజాయ్ చేసిన జనానికి ఈ సమయం ఏమంత పెద్దది కాదనీ కేమరాన్ భరోసా ఇస్తున్నారు. నిజానికి ‘అవతార్’ ఫ్రాంచైజీలో నాలుగు భాగాలు రూపొందించడానికి ఒక బిలియన్ డాలర్లు అంచనా వేశారు. మొదటి భాగం 246 మిలియన్ డాలర్లతోనూ, రెండో భాగం 250 మిలియన్ డాలర్లతోనూ తెరకెక్కింది. ఈ లెక్కన రాబోయే రెండు భాగాలు కలిపి 504 మిలియన్ డాలర్లతో రూపొందాలి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ కారణంగానే ఈ రెండో భాగం హిట్ అయితేనే తరువాతి భాగాలు జనం ముందుకు వస్తాయని, లేదంటే అంతే సంగతులని కేమరాన్ మాట! అందువల్లే ‘అవతార్-2’ను ఆదరించకుంటే, తరువాతి భాగాలు ఉండవని డైరెక్టర్ జేమ్స్ ప్రేక్షకులను భయపెడుతున్నాడేమో అనీ హాలీవుడ్ జనం భావిస్తున్నారు. ఇలా భయపెట్టి మరీ ‘అవతార్’ను చూపడం ఏం బాగోలేదనీ అమెరికా వాసుల అభిప్రాయం. ఏది ఏమైనా రాబోయే ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ హిట్ కాకుంటే పరిస్థితి ఏంటో? ఇంతకూ జేమ్స్ జనాన్ని భయపెడుతున్నాడా? లేక ఆయనే భయపడుతున్నాడా?

Exit mobile version