Jacqueline Fernandez Found Her Dream Boy: సుఖేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆమె షాకింగ్ విషయాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. సుఖేశ్‌తో సన్నిహితంగా మెలుగుతున్న రోజుల్లో, అతడ్ని పెళ్లి చేసుకోవాలని జాక్వెలిన్ అనుకుందని వెల్లడైంది. తన స్నేహితులతోనూ ఆమె ఈ విషయాన్ని పంచుకున్నట్టు తేలింది. ‘‘నా డ్రీమ్ బాయ్ దొరికాడు, అతడ్నే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ పలుసార్లు స్నేహితుల ముందు ప్రస్తావించినట్టు వెలుగులోకి వచ్చింది. నిజానికి.. సుఖేశ్‌తో ముద్దాడుతున్న ఫోటోలు బయటకు వచ్చినప్పుడు, అతనితో తనకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు అతడు ‘ఆమె డ్రీమ్ బాయ్’ అని విచారణలో తేలింది. అంతేకాదు.. చాలామంది కో-స్టార్స్ సుఖేశ్‌తో దూరంగా ఉండమని జాక్వెలిన్‌ని సూచించినా, ఆమె వారి మాటల్ని పెడచెవిన పెట్టి, చెట్టాపట్టాలేసుకొని తిరిగిందని కూడా తెలిసింది.
మరోవైపు.. నోరా ఫతేహిని సైతం ఈ మనీ లాండరింగ్ కేసులో ఇటీవల విచారించారు. అతడు బీఎండబ్ల్యూ కార్ బహుమతిగా ఇచ్చాడన్న విషయం తెలిశాక, అతనితో సంబంధాలు ఉండొచ్చని అధికారులు పిలిపించారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చింది. తనకు, సుఖేష్‌కి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. సుఖేశ్ తనకు బీఎండబ్ల్యూ కారును బహూకరించలేదని.. చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైనందుకు సుఖేశ్ భార్య తనకు ఆ కారును ఇచ్చినట్టు తెలిపింది. కాగా.. ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ అయిన శివిందర్ సింగ్ భార్య నుంచి రూ.200 కోట్లను సుఖేశ్ దోచుకున్నట్టు కేసు నడుస్తోంది. దోచుకున్న ఈ సొమ్ముతో సుఖేశ్.. బాలీవుడ్ తారలకు భారీ బహుమతులు కూడా ఇచ్చినట్టు తేలింది. మరో ముగ్గురు బాలీవుడ్ నటీమణులు సైతం సుఖేశ్ నుంచి భారీ బహుమతులతో డబ్బులు అందుకున్నారని.. వాళ్లని సైతం త్వరలోనే విచారణకు పిలువనున్నారని సమాచారం.
