NTV Telugu Site icon

Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ

Ahiteja Bellamkonda

Ahiteja Bellamkonda

పూరి జగన్నాథ్, రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ అనౌన్స్ చెయ్యగానే లైగర్ సినిమాతో నష్టపోయిన వాళ్లు రిలే దీక్షలకి దిగారు. ఆచార్య సినిమా కొరటాల శివ ఇమేజ్ దెబ్బ తీసి, ఇండస్ట్రీ హిట్  ఇచ్చిన దర్శకుడిని ట్రోల్ అయ్యేలా చేసింది. ఏజెంట్ సినిమా మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కథ లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయాం, ఆ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం అని అనీల్ సుంకర లాంటి ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దిల్ రాజు అంతటి వాడు తన పాతికేళ్ల కెరీర్ లో శాకుంతలం సినిమా ఇచ్చినంత షాక్ మరే సినిమా ఇవ్వలేదు అని ఓపెన్ గా చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సినిమాల గురించి రాయాల్సి వస్తుంది. వీటన్నింటికి రిజల్ట్ వెనక ఉన్న అతి పెద్ద కారణం ‘ సరైన కథ లేకపోవడమే, సరిగ్గా కథ రాసుకోలేకపోవడమే’. యావరేజ్ సినిమా అనే మాట వినగానే ఆడియన్స్ థియేటర్స్ ని అవాయిడ్ చేస్తున్న కాలంలో ఉన్నాం మనం. ఇలాంటి సమయంలో ఒక సినిమా బ్రతకాలన్నా, ఇండస్ట్రీలో ఇంకో అవకాశం రావాలన్నా సూపర్ హిట్ సినిమానే తీయాలి, అలాంటి కథనే రాయాలి. ఈ విషయాన్నే చాలా క్లియర్ గా చెప్పాడు యంగ్ ప్రొడ్యూసర్ అహితేజ బెల్లంకొండ.

ఇండస్ట్రీ మొత్తం కాంబినేషన్ లని నమ్ముకోని సినిమాలు చేస్తుంది కానీ నిజానికి అందరూ నమ్మల్సింది కథని. ఇదే విషయాన్ని ట్వీట్ చేసి తన ఒపినియన్ చెప్పాడు ‘అక్షర’, ‘శశివదనే’ సినిమాల ప్రొడ్యూసర్ అహితేజ బెల్లంకొండ. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో-హీరోయిన్లుగా నటిస్తున్న శశివదనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అహితేజ, దర్శకులపై ప్రేమతో ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇచ్చాడు. “ప్లీజ్ కథపైన జాగ్రత్తగా వర్క్ చెయ్యండి, ప్రీ ప్రొడక్షన్ కి కావలసినంత టైమ్ తీసుకోండి. హీరో, హీరోయిన్ల డేట్స్ కోసం పరిగెట్టకండి. పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వకుండా షూటింగ్ కి వెళ్లకండి. ఈరోజుల్లో మీ ప్రతి సినిమా మీ మొదటి సినిమానే, రిజల్ట్ తేడా కొడితే ముందుగా మిమ్మల్నే నిందిస్తారు. ఒక ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఆ దర్శకుడికి ఇండస్ట్రీలో మళ్లీ మంచి అవకాశం రావడం చాలా కష్టం” అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

ఈ ట్వీట్ కి “మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు నాశనం అయిపోతున్నారు అనే రిప్లై రావడంతో దానికి కూడా రెస్పాండ్ అయిన అహితేజ “ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎంత ఉన్నారో మార్కెట్ లో మీకు తెలుసు కదా సర్. వీరిలో చాలా మందికి అన్ని విషయాల్లో మంచి కమాండ్ ఉంది కానీ జడ్జ్మెంట్ అండ్ టీమ్ పైన కమాండ్ మాత్రం లేదు. ఇక్కడ అంతా ప్యూర్ బిజినెస్ విత్ కాంబినేషన్స్” అని ట్వీట్ చేశాడు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ చెప్పిన మాటలో నిజముంది ఎందుకంటే కాంబినేషన్స్ సినిమాని ఆడించవు, కథా కథనాలే సినిమాని ప్రేక్షకులకి దగ్గరయ్యేలా చేస్తాయి. మంచి కథ… మంచి హిట్ ఇదే సూత్రం, దీన్ని దాటిన సినిమా థియేటర్స్ లో బ్రతికే అవకాశమే లేదు.