మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్లపై దృష్టి పెట్టబోతున్నారు మేకర్స్. ఇప్పటికే “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఉత్కంఠత నెలకొంది.
Read Also : KGF 2 : పవర్ ఫుల్ డైలాగ్స్… హనుమాన్ చౌదరి ఎంట్రీ ఎలాగంటే ?
తాజాగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. “ఆచార్య” నిర్మాతలు ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారంటూ ఇప్పటికే టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ఏంటంటే… మెగాస్టార్ కోసం ఏకంగా సీఎం రంగంలోకి దిగబోతున్నారట… అది కూడా ఏపీ సీఎం జగన్!. విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా జరగనున్న “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. సీఎం జగన్‌తో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చొరవతోనే భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఊరట లభించింది. మరోవైపు “ఆచార్య” సినిమాను నిర్మిస్తున్నది సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, న్యాయ సలహాదారుడు అయిన నిరంజన్‌రెడ్డి. “ఆచార్య” ఈవెంట్ కు ఏపీ సీఎం ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్రేజీ న్యూస్ లో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.