‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం!
ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని, ఆ పాటలో తమ హీరో రామ్ చరణ్ ను విలన్ గా చిత్రీకరించారని చెర్రీ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. సెకండాఫ్ లో రామ్ చరణ్ పాత్రను పెద్దది చేసి, యన్టీఆర్ కు ప్రాధాన్యం లేకుండా చేశారని జూనియర్ అభిమానులూ నిరాశ చెందారు. ఇలా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ‘ట్రిపుల్ ఆర్’తో సంతృప్తి చెందలేకపోయారు. అందువల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనీ ఓ వాదన. మరి ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బాగా చేశారు అన్న ప్రశ్నకు మాత్రం ఎవరికి వారు తమ హీరోలకే మార్కులు వేసుకుని ఆనందించారు. ఇక్కడంటే పాత్రల నిడివిని బట్టి మార్కులు వేస్తారు కానీ, అంతర్జాతీయంగా అయితే, తెరపై కొన్ని నిమిషాలు కనిపించినా, అదరహో అనిపించిన వారికే జేజేలు పలుకుతారు. ఆ తీరున ఇజ్రాయెల్ మీడియా ‘ట్రిపుల్ ఆర్’లో కొమరం భీమ్ గా నటించిన జూనియర్ యన్టీఆర్ కే జేజేలు పలికింది. అంతటితో ఆగకుండా “What Hollywood Has Forgotten?” అనే ఫుల్ పేజ్ ఐటమ్ రాసింది. చిత్రమేమిటంటే, అందులో జూనియర్ యన్టీఆర్ నటనను మాత్రమే హైలైట్ చేస్తూ రచన సాగడం గమనార్హం!
‘ట్రిపుల్ ఆర్’ మూవీని ఇజ్రాయెల్ భాషలో ఏమీ విడుదల చేయలేదు. నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శితమవుతున్న హిందీ వర్షన్ ను చూసి, కింద ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ను అర్థం చేసుకొని అక్కడి మీడియా ‘ట్రిపుల్ ఆర్’కు పెద్ద పీట వేసింది. ఈ తరహా దేశభక్తి చిత్రాలకు మరింత ప్రోత్సాహం ఉండాలనీ చూసిన జనం అంటున్నారు. ‘బాహుబలి’ స్థాయిలో ‘ట్రిపుల్ ఆర్’ ఘనవిజయం సాధించలేదని బాధపడేవారికి ఇజ్రాయెల్ ఆర్టికల్ పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఆ సినిమా ద్వితీయార్ధంలో తమ హీరో యన్టీఆర్ కు అన్యాయం జరిగిందని బాధపడే యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ ఆర్టికల్ ను చూసయినా తమ అభిప్రాయం మార్చుకుంటారేమో చూడాలి.
