NTR:పలు విషయాల్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ యన్టీఆర్ ఓ విషయంలో మాత్రం ఆ మాట నిలుపుకోలేక పోతున్నారు. బహుపాత్రలు ధరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న నటరత్న యన్టీఆర్ మనవడైన జూనియర్ యన్టీఆర్ మాత్రం ఆ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందంటే జూనియర్ తాజా చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తెలుగు చిత్రసీమలో నటరత్న కంటే ముందు పలువురు ద్విపాత్రాభినయం చేసి అలరించారు. అయితే యన్టీఆర్ ‘రాముడు-భీముడు’ విడుదలయ్యాకే డ్యుయల్ రోల్ కు ఓ క్రేజ్ ఏర్పడింది. ఇక ఆయన ట్రిపుల్ రోల్ చేశాకే తెలుగునాట త్రిపాత్రాభినయాలకు ఊపొచ్చింది. ఇక ద్విపాత్రాభినయాల్లో యన్టీఆర్ తెలుగుసినిమా రంగంలో రికార్డు సృష్టించారు. అత్యధిక డ్యుయల్ రోల్ మూవీస్ లో నటించిన ఘనత నటరత్న సొంతం. అంతేకాదు, తండ్రీకొడుకులుగా నటించి వరుసగా మూడేళ్ళు బ్లాక్ బస్టర్స్ చూసిన ఘనత కూడా యన్టీఆర్ కే దక్కింది. 1980లో ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘కొండవీటి సింహం’, 1982లో ‘జస్టిస్ చౌదరి’ సినిమాలలో తండ్రీకొడుకులుగా రామారావు అలరించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు.
ఇక జూనియర్ విషయానికి వస్తే – ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఆంధ్రావాలా’ ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. ఆ పై ‘అదుర్స్’లో అన్నదమ్ములుగా అదరహో అనిపించారు. ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ లో భలేగా సాగి, ఆ తరువాత మెత్తబడింది. ఆ పై ‘శక్తి’లోనూ ద్విపాత్రాభినయమే, తరువాత ‘జై లవకుశ’లో త్రిపాత్రాభినయమూ చేశారు. ఈ నాలుగు చిత్రాలు జూనియర్ యన్టీఆర్ కు నటునిగా మంచి పేరు సంపాదించాయే కానీ, బ్లాక్ బస్టర్స్ గా నిలువలేకపోయాయి. చిత్రమేమిటంటే “ఆంధ్రావాలా, శక్తి” చిత్రాల్లో జూనియర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అవి అంతగా అలరించలేక పోయాయి. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యంగ్ టైగర్ తాజా చిత్రంలో మరోమారు తండ్రీకొడుకులుగా కనిపించనుండటంతోనే అనుమానాలు మొదలయ్యాయి. మరి తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్ లో కనిపించిన రెండు సార్లు యంగ్ టైగర్ మ్యాజిక్ చేయలేకపోయారు. దాంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలిన నటరత్న నటవారసునిగా అడుగుపెట్టిన బాలకృష్ణ సైతం ఆరంభంలో ద్విపాత్రాభినయాలతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. తరువాత ఆయన నటించిన “సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి” వంటి చిత్రాలు అనూహ్య విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకోలేక పోయినా, ‘బాబాయ్ కి తగ్గ అబ్బాయ్’ అనిపించుకుంటారేమో చూడాలి!
