ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాలలో అభిమానుల అభిప్రాయం ప్రకారం మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను విడుదల చేసింది ‘ఐఎమ్ డిబి’ (ద ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) సంస్థ. అయితే ఈ సంస్థ 7 లేదా ఆపై రేటింగ్ ఉన్న సినిమాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో హైదరాబాదీ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రథమ స్థానాన్ని, ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్2’ సెకండ్ ప్లేస్ ను రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూడో స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రాలు విడుదలైన 4 వారాల్లో ఇండియాలో అత్యధిక స్థాయిలో వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే అతి తక్కువ బడ్జెట్ 15 కోట్లలో నిర్మితమై దాదాపు 340 కోట్లను వసూలు చేసి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో నిర్మాతలకు లాభాలను ఆర్జించి పెట్టింది ‘ది కాశ్మీర్ ఫైల్స్’. కాశ్మీరీ పండిట్స్ ఊచకోత ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గానే కాదు విమర్శకుల మెప్పును సైతం పొందింది. దీనిని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై జీ స్టూడియోతో కలసి అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇది బాలీవుడ్ లో అభిషేక్ తొలి చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్వకత్వంలో తొలి సినిమాతోనే ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోవడంపై టాలీవుడ్ ప్రముఖులు అభిషేక్ ను అభినందిస్తున్నారు. ఈ సినిమాతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సన్నిహితుడై పోయాడు అభిషేక్ అగర్వాల్. ఎంతగా అంటే ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినపుడు లోకల్ బిజెపీ లీడర్స్ తో పాటు ఆయనను రిసీవ్ చేసుకునేంత. ఇలా ఒకే సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు అభిషేక్. ఇప్పుడు ఐఎమ్ డిబి వారి టాప్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ దక్కటంతో ఆయన అదృష్టంపై సహజంగానే అసూయ కలగక మానదు. ఇక ఈ లిస్ట్ లో తొలి మూడు స్థానాలను దక్కించుకున్న దక్షిణాది 5వ ప్లేస్ లోనూ కమల్ ‘విక్రమ్’, 10వ స్థానంలో ప్రణవ్ మోహన్ లాల్ ‘హృదయం’ తో దుమ్మురేపింది. ఆలీయాభట్ ‘గంగూబాయ్ ఖతివాడి’ నాలుగో ప్లేస్, అమితాబ్ ‘ఝుండ్’ ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ ‘ఫృథ్వీరాజ్’ ఏడో స్థానంలో, అజయ్ దేవగన్ ‘రన్ వే34’ ఎనిమిదో ప్లేస్ లో యామిగౌతమ్ ‘ఎ థర్స్ డే’ 9వ వరుసలో నిలిచాయి.
